త్రివిక్రమ్ సినిమా వస్తుంది అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే త్రివిక్రమ్ కథకు తోడు మంచి కామెడీ టైమింగ్ తో తన సినిమాలను తెరకెక్కిస్తాడు. ఎంతటి హీరోతోనైనా కామెడీ పండించగల సత్తా ఉన్న దర్శకుడు త్రివిక్రమ్. ఆయన సినిమాలు థియేటర్స్ లోకన్నా బుల్లితెర మీద పెద్ద హిట్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. త్రివిక్రమ్ డైరెక్టన్ లో వచ్చిన అతడు, జులాయి, ఖలేజా చిత్రాలు ఇప్పటికి బుల్లితెరమీద ఆదరణ తగ్గలేదంటేనే ఆయన స్టయిల్ కి బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా ఫిదా అయ్యారో అర్ధమవుతుంది.
త్రివిక్రమ్ సినిమాలన్నీ నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయి. మొన్నటికి మొన్న నితిన్ హీరోగా సమంత లీడ్ రోల్ లో అ... ఆ సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఆ సినిమా మీనా అనే నవల నుండి కాపీ కొట్టి తీశాడని అన్నారు. అసలు అ.. ఆ సినిమాలానే గతంలో మీనా సినిమా కూడా తెరకెక్కినది. కానీ అదే సినిమాని త్రివిక్రమ్ తనదైన స్టయిల్ లో ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించి హిట్ కొట్టాడు. అప్పట్లో మీనా నవల తో త్రివిక్రమ్ సినిమా చేసాడని బాగానే రచ్చ జరిగింది. దాన్ని త్రివిక్రమ్ కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమాలో మీనా నవల రచయిత పేరు వెయ్యని కారణంగా కూడా త్రివిక్రమ్ విమర్శలు ఎదురుకున్నాడు.
ఇకపోతే ఇప్పుడు పవన్ తో అజ్ఞాతవాసి ని తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్.. త్వరలోనే ఎన్టీఆర్ తో ఒక చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. ఆ చిత్రం కోసం ఒక డిటెక్టీవ్ నవలను కొనుక్కుని దాని ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడనే టాక్ నడుస్తుంది. 1980 నాటి ఆ డిటెక్టీవ్ నవలతోనే ఎన్టీఆర్ సినిమా తియ్యబోతున్నాడని సమాచారం. ఆ నవలను త్రివిక్రమ్ కూలంకషంగా పరిశీలించి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. మరి డిటెక్టీవ్ నవల అంటే... ఈ సినిమాలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ని ఒక డిటెక్టీవ్ లా మార్చబోతున్నాడా.. అందుకే ఎన్టీఆర్ ఎటువంటి మేకోవర్ ప్రయత్నించడం లేదా.. అనే డౌట్ కొడుతోంది.