గత పదేళ్లుగా రాజశేఖర్‌కి హిట్లు కాదు కదా కనీసం యావరేజ్‌లు కూడా లేవు. ఫాలోయింగ్ తగ్గిపోయింది.. వయసు మీద పడింది.. క్రేజ్,ఇమేజ్ తగ్గడంతో మార్కెట్టే లేకుండా పోయింది. కానీ ఆయన పదేళ్ల తర్వాత 'పీఎస్వీగరుడవేగ'లో ఘనంగా కమ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఈ చిత్రంలో రాజశేఖర్ గెటప్, ఆయన స్టైలిష్ యాక్షన్, అన్ని ఎంతో బాగున్నాయి. అయినా ఈ చిత్రం విషయంలో ఆయన కంటే దర్శకుడు ప్రవీణ్‌సత్తార్‌ని ఇంకా చెప్పాలంటే ఐదు కోట్ల మార్కెట్ కూడా లేని రాజశేఖర్‌ని నమ్మి దాదాపు 30కోట్ల దాకా ఖర్చుపెట్టిన నిర్మాత కోటేశ్వరరాజు గట్స్‌ని మెచ్చుకోవాలి. ఇక పవన్ అభిమానులు నితిన్‌కి ఎలా అండగా ఉన్నారో రాజశేఖర్ 'పీఎస్వీగరుడవేగ'కి బాలయ్య అభిమానుల అండ అంతగా ఉంటోంది అనే మాట వాస్తవం. ఈ చిత్రం ముహూర్తం పెట్టింది బాలయ్యే.. ఆడియో విడుదల చేసింది బాలయ్యే కావడంతో బాలయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభం జరుగుతుందని చెబుతూ, బాలయ్య అభిమానులు ఈ చిత్రం ప్రమోషన్‌లో పాలు పంచుకుంటున్నారు.
ఇక తాను చేసిన 'మహంకాళి, గడ్డంగ్యాంగ్' వంటి చిత్రాల విషయంలో విడుదలకు ముందు గొప్పగా చెప్పానని, ఆ చిత్రాల ద్వారా బాగా నష్టపోయానని ఈసారి 'పీఎస్వీగరుడవేగ' కి సినిమా ముందు ఏమీ మాట్లాడనని, సినిమానే మాట్లాడుతుందని రాజశేఖర్ చెప్పిన మాట నిజమైంది. ఇక 'పట్టపగలు, అహం' విషయంలో కూడా ఆయనకు ఎదురు దెబ్బలే తగిలాయి. ఇక తాజాగా రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ చిత్రం పాజిటివ్ టాక్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. రాజమౌళి గారు సినిమాకి హిట్ టాక్ వచ్చింది.. ఆదివారం షోకి టిక్కెట్ బుక్ చేసుకున్నానని చెప్పాడు. దానికి రాజశేఖర్ మీ మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పాడట.
ఇక తన గురించి చెబుతూ డాక్టర్ చదివిన తర్వాత తమిళంలో చిత్రాలు చేస్తున్న సమయంలో టి.కృష్ణ గారు 'వందేమాతరం' చిత్రానికి నన్ను తీసుకున్నారు. నాకు మొదట్లో నత్తి ఉండేది. ఇప్పుడు కవర్ అయింది. దీంతో నిర్మాత ఈయన హీరోగా పనికిరాడని అన్నారు. కానీ టి.కృష్ణ గారు మాత్రం ఈయన స్క్రీన్‌పై బాగుంటాడని ఒప్పించారు. ఆ తర్వాత అదే బేనర్‌లో ఐదారు చిత్రాలు చేశాను. ఇక 'తలంబ్రాలు' చిత్రంలో విలనే హీరో. మొదట ఆ చిత్రంలో చేయకూడదని అనుకున్నా. నిర్మాత ఒప్పించారు. జీవితకు మంచి పేరు వస్తుందని, నన్ను, నా క్యారెక్టర్‌ని చూసి ఆడియన్స్ తిట్టుకుంటారని భావించాను. కానీ అది రివర్స్ అయింది. థియేటర్‌లో ఓ అమ్మాయి ఆ సినిమా చూసి నాకు ముద్దుపెట్టింది. తర్వాత అదే బేనర్‌లో 'ఆహుతి' సూపర్‌హిట్, 'అంకుశం' బ్లాక్‌బస్టర్ అని చెప్పుకొచ్చాడు. ఇక 'పీఎస్వీగరుడవేగ' విజయంతో ఈ చిత్రం యూనిట్, దర్శకుడు, నిర్మాత, జీవిత, రాజశేఖర్ కూతుర్లు పండగ చేసుకున్నారు. ఒకరి మెడలో ఒకరు దండలు వేసి రాజశేఖర్ అయితే తీన్‌మార్ డ్యాన్స్ చేశాడు.