పీఎస్వీ గరుడవేగ సినిమా గత శుక్రవారమే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా గనక విజయం సాధించకపోతే.. హీరో రాజశేఖర్ కెరీర్ క్లోజ్ అయ్యే పరిస్థితి. అలాగే ఈ సినిమాతో దర్శకుడిగా తానేమిటో ప్రూవ్ చేసుకోవాల్సిన అగత్యం ప్రవీణ్ సత్తారుది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో అటు రాజశేఖర్ కెరీర్ ఇటు ప్రవీణ్ సత్తారు కెరీర్ లు నిలబడ్డాయనే చెప్పాలి. అయితే సినిమా టాక్ బావున్నప్పటికీ గరుడవేగ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే.. అని టాక్ ఉన్నప్పటికీ రాజశేఖర్ కి దర్శకుడు ప్రవీణ్ కి మాత్రం అవకాశాల మీద అవకాశాలు వచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి.
హీరో రాజశేఖర్ పరిస్థితి ఎలా ఉన్న ఇప్పుడు దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి మాత్రం అవకాశాలు మొదలైపోయాయి. ఇప్పటికే గోపీచంద్ బయోపిక్ కి దర్శకుడిగా ప్రవీణ్ పనిచేయాల్సి ఉండగా.... ఇప్పుడొక యువ హీరో ప్రవీణ్ కి ఛాన్స్ ఇచ్చినట్లుగా... దాదాపు ఆ యంగ్ హీరోతో సినిమా ఖాయమైనట్లుగా క్లారిటీ వచ్చేసింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు. 'లై' సినిమాతో డిజాస్టర్ అందుకుని ప్రస్తుతం త్రివిక్రమ్ - పవన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న నితిన్. ఇప్పటివరకు యంగ్ హీరోలు గాని... స్టార్ హీరోలతో గాని పని చెయ్యని ప్రవీణ్ సత్తారు మొదటిసారి నితిన్ తో పని చెయ్యబోతున్నాడు.
నితిన్ - ప్రవీణ్ సత్తారు కలయికలో రాబోయే సినిమాపై నితిన్ స్వయంగా ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు. నితిన్ ఓన్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణంలోనే ప్రవీణ్ సత్తారు సినిమా ఉండబోతుందని... త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకెళ్ళబోతున్నట్లుగా నితిన్ చెబుతున్నాడు. మరి గరుడవేగ హిట్ తో ప్రవీణ్ తలరాత ఒక్కసారిగా ఎలా మారిందో అంటున్నారు కొందరు. మరి గరుడవేగని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించి శభాష్ అనిపించుకున్న ప్రవీణ్ తో కలిసి పనిచేయడానికి మరికొంతమంది హీరోలు కూడా ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం ఉంది.