సినిమా వాళ్లకి దసరా, సంక్రాంతి తర్వాత పెద్ద పండగ అంటే క్రిస్మస్ అని చెప్పుకోవాలి. ఆ రెండు పండుగలతో పాటే క్రిస్మస్ పండగకి కూడా టాలీవుడ్ హీరోలు తమ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. ఇక ఈ ఏడాది క్రిస్మస్ పండుగను క్యాష్ చేసుకోవాలని మొదట్లో చాలామంది హీరోలు భావించారు. కానీ అక్కినేని నాగార్జున తన రెండో కొడుకు అఖిల్ 'హలో' సినిమాని డిసెంబర్ 22 న తెస్తున్నాడని తెలిసి మిగతా వాళ్ళు సైలెంట్ అయ్యారు. అందులో నాని MCA సినిమా ప్రీ పోన్ అయితే అనుష్క 'భాగమతి' సినిమా పోస్ట్ పోన్ చేసుకుంది.
అయితే అఖిల్ 'హలో' సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుండే ఈ సినిమాను డిసెంబర్ 22 న రిలీజ్ చేస్తామని చెబుతూ వచ్చారు. అఖిల్ కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఐతే ఈ సినిమా విడుదలకు ఇంకో నెలన్నర మాత్రమే సమయం ఉండగా.. ఇప్పటివరకు మూడు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ మొదలెట్టేసి.. ప్రమోషన్లు మొదలుపెడితే కానీ.. రిలీజ్ టైంకి రావాల్సినంత హైప్ రాదు. కానీ ఈ 'హలో' సినిమా ఇంకా షూటింగ్ దశలోనే వుంది.
అయితే ఈ సినిమా త్వరగా కానివ్వాలంటూ విక్రమ్ మీద తాను ఒత్తిడి తెస్తున్న విషయాన్ని కూడా నాగ్ ‘రాజు గారి గది-2’ ప్రమోషన్లలో భాగంగా చెప్పాడు. మరి దర్శకుడు విక్రమ్... నాగ్ చెప్పింది పాటిస్తున్నాడో లేదో తెలీదు కానీ... డిసెంబర్ 22 న ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనే టాక్ మాత్రం వినబడుతుంది. మరి నాగార్జున తొందర చేస్తుంటే.. విక్రమ్ మాత్రం క్వాలిటీ విషయంలో రాజీపడేది లేదంటూ చెప్పేస్తున్నాడట. మరి నాగ్ - విక్రమ్ ల మధ్య సఖ్యత ఏర్పడి... త్వరగా ఈ సినిమా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, ప్రమోషన్లు సమాంతరంగా చేసుకుని.. చెప్పిన ప్రకారమే డిసెంబరు 22 రిలీజ్ చేస్తారేమో చూద్దాం.