ఒకప్పుడు రాజశేఖర్ సినిమాలంటే పడి చచ్చేవారు కాదు గాని బాగానే ఆదరించేవారు ప్రేక్షకులు. కానీ వరసబెట్టి ఒకటేరకం సినిమాలు చేసేసరికి రాజశేఖర్ కి కెరీర్ లో భారీ గ్యాప్ వచ్చేసింది. రాజశేఖర్ తో పాటు ఉన్న సీనియర్ హీరోలంతా ఇప్పటికి ఫామ్ లో దూసుకుపోతుంటే... రాజశేఖర్ మాత్రం చాలా కాలంగా ఫామ్ లో లేడు. భారీ గ్యాప్ తీసుకుని మరీ... ఎంతో నమ్మకంతో భారీ బడ్జెట్ తో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పీఎస్వీ గరుడవేగ లో రాజశేఖర్ హీరోగా నటించాడు. ఈ సినిమా గత శుక్రవారమే విడుదలై సూపర్బ్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేక డీలా పడింది.
పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ ఇంత డల్ గా ఉండేసరికి గరుడవేగా కోసం పెట్టిన బడ్జెట్ రాదేమో అనే అనుమానం అందరిలో బయలుదేరింది. అసలు గరుడవేగ సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు పెద్దగా లేవు.... ఇక భారీ లాభాలు అందుకునే పరిస్థితి అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం కనబడడం లేదు. ఇప్పటికి కేవలం గరుడవేగ ఐదు కోట్లు మాత్రమే షేర్ రాబట్టింది. మరి ఈ సినిమాకి భారీగానే బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. అయితే 9 కోట్ల షేర్ కొల్లగొడితే గాని గరుడవేగ సేఫ్ జోన్ లోకి రాదు అంటున్నారు. అయితే కలెక్షన్స్ వీక్ అయినప్పటికీ ఇతరత్రా హక్కుల విషయంలో మాత్రం భారీ లాభాలే వచ్చేలా కనబడుతున్నాయి.
గరుడవేగ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయట. మరోపక్క గరుడవేగ డిజిటల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడిందంటున్నారు. అలాగే బాలీవుడ్ హాట్ సుందరి సన్నీలియోన్ గరుడవేగాలో ఐటెం సాంగ్ లో ఆడిపాడడంతో హిందీలో కూడా ఈ సినిమా శాటిలైట్ హక్కులకు మంచి ధర పలికినట్లుగా సమాచారం. అంతేకాకుండా గరుడవేగా తమిళ రీమేక్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా చెబుతున్నారు. మరి బాక్సాఫీసుని రఫ్ ఆడించలేకపోయినా.. గరుడవేగాతో నిర్మాతలు భారీ లాభాలు ఈ రకంగా జేబులో వేసుకుంటున్నారు. అయితే గరుడవేగా విడుదల కోసం రాజశేఖర్ ఇల్లు తనఖా పెట్టాడనే ప్రచారం జరిగింది కాబట్టి ఈ లాభాల్లో భారీ వాటాను రాజశేఖర్ అందుకుంటాడనే టాక్ బయటికి వచ్చింది.