సాధారణంగా జర్నలిజంలో ఓ వాక్యం ఉంది. మనిషిని కుక్క కరిస్తే అది వార్త కాదు.. మనిషి కుక్కను కరిస్తే అదే పెద్దన్యూస్ అంటారు. అలాగే రావణాసురుడు సీతని ఎత్తుకెళ్లిపోతే అది పెద్ద న్యూస్ కాదు.. రావణాసురిడి నైజం అదే. కానీ శ్రీరాముడు శూర్పణకని ఎత్తుకెళ్లితే అది పెద్ద విషయం ఎందుకంటే రాముడికి క్లీన్‌చిట్ ఉంది. ఇక విషయానికి వస్తే మాస్ చిత్రాలు తీసే దర్శకుల చిత్రాలలో ఎన్నో ద్వందార్ధాలు, ఇబ్బంది పెట్టే సీన్స్, శృంగారం పేరుతో గ్లామర్ అందాల ప్రదర్శన, కామెడీ పేరుతో ఎన్నో చేస్తూ ఉంటారు. అదే కె.విశ్వనాథ్, బాపు వంటి వారి చిత్రాలలో అలాంటివి ఉంటే బాధపడతాం గానీ కమర్షియల్ దర్శకుల చిత్రాలు చూసినప్పుడు కూడా మాస్ కోసం ఇది తప్పదు... అని సర్దుకుపోతాం.
ఇక డైరెక్టర్ వివి వినాయక్ మాస్ పల్స్‌ని బాగా తెలుసుకున్న హీరో. ఈయన చిత్రాలలో హింస, రక్తపాతం, సుమోలు గాలిలోకి ఎగరడం.. ఇలాంటివి సహజం. కానీ ఆయనే ఓ చిత్రంలోని సీన్‌ని చూసి అలాంటి సీన్ తీసినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పడం విశేషం. ఇందులో వినాయక్ నిజాయితీని మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం ఆయన సాయిధరమ్‌తేజ్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నాడు. కాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు 'ఛ... ఆ సీన్ ఎందుకు తీశాను. అది తీయకుండా ఉండాల్సిందే' అనే ఫీలింగ్, అలాంటి అనుభవం ఎదురైందా? అని అడిగితే ఆయన నిజాయితీగా సమాధానం ఇచ్చాడు.
ఎన్టీఆర్ నటించిన 'సాంబ' చిత్రంలో ఓ చెత్త సీన్ ఉంది. దానిని తీయడం కూడా ఇష్టం లేక కెమెరాను కూడా పక్కనపెట్టేశా. కానీ పక్కవారు బాగానే ఉంది కదా...! తీయండి అని ఒత్తిడి చేయడంతో నా వల్ల షూటింగ్ ఆగిపోకూడదని ఈ సీన్‌ని తీశాను. ఆ సీన్ గురించి చెప్పటానికి కూడా ఇబ్బందికరం. దానిని ఎడిటింగ్ లో తీసేద్దామని భావించినా, అక్కడ కూడా తీసేయలేకపోయాను. అలా నేను బాగా ఫీలయ్యింది మాత్రం 'సాంబ' చిత్రంలోనే ఆ సీన్ మాత్రమే అంటూ వినాయక్ నిజాయితీగా తన తప్పును ఒప్పుకున్నాడు.