ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో పోరు మంచి రంజుగానే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'తో జనవరి 10 నుండి బాక్సాఫీసు వద్ద హడావిడి మొదలెట్టేస్తుంటే.... బాలకృష్ణ కూడా 'జై సింహా'ని సంక్రాంతికే దింపుతానంటున్నాడు. మరి ఈ రెండు బడా సినిమాల్తోపాటు మరో రెండు మూడు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలోఉన్నాయి. ఇప్పుడు ఈ తెలుగు సినిమాల్తో పాటు తమిళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మరో సినిమా కూడా తెలుగులోకి డబ్ అవుతూ ఈ సంక్రాంతి సీజన్ కే రాబోతుందని న్యూస్ వినబడుతుంది.
విశాల్ తాజాగా నటించిన తమిళ సినిమా ఇరుంబు తెరై (ఇనుపతెర) తెలుగు వెర్షన్ ను కూడా ఈ సంక్రాంతికే విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం విశాల్ సినిమా 'డిటెక్టివ్' రెండు తెలుగు సినిమాల్తో పోటీ పడి తెలుగులో హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసుని దున్నేస్తుంది. అలాగే ఇప్పుడు సంక్రాంతికి విడుదల చెయ్యబోయే విశాల్ సినిమా 'ఇరుంబు తెరై'లో తెలుగు జనాలకు పరిచయస్తుడైన సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్, అక్కినేని వారి కోడలు హీరోయిన్ సమంత కూడా నటిస్తోంది.
పిఎస్ మిత్రన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ విశాల్ తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.