చాలా గ్యాప్ తర్వాత రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్' చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఇక ఆయన ప్రస్తుతం విక్రమ్ సిరికొండ డైరెక్షన్‌లో 'టచ్ చేసి చూడు' చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతి తర్వాత విడుదల కానున్న ఈచిత్రంలో రాశిఖన్నా, సీరత్‌కపూర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా 'ఆగడు' నుంచి ఫ్లాప్‌లో ఉండి 'బ్రూస్‌లీ, మిస్టర్' వంటి డిజాస్టర్స్ అందుకున్న శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించడానికి ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా సిద్దంగా లేరు. కానీ రవితేజను 'నీకోసం' చిత్రంతో హీరోగా పరిచయం చేసి ఆ తర్వాత కూడా ఆయనకు 'దుబాయ్‌శ్రీను, వెంకీ' వంటి హిట్లనిచ్చిన ఆయనతో చేసేందుకు రవితేజ ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇక ఈ చిత్రానికిగాను రవితేజ, శ్రీనువైట్ల ఇద్దరికీ సినిమా ప్రారంభానికి ముందు రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదని, సినిమా విడుదలై హిట్టయిన తర్వాతే వారికి రెమ్యూనరేషన్ ఇస్తారనే కండీషన్ పెట్టినట్లు సమాచారం. ఇందులో కాజల్ హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయిందట. ఇక ఈ భామ శ్రీనువైట్ల ఆఖరి హిట్ 'బాద్‌షా'లో హీరోయిన్‌గా చేయడంతో ఆ సెంటిమెంట్ తనకు కలిసి వస్తుందని శ్రీనువైట్ల భావిస్తున్నాడు. మరోవైపు కాజల్ రవితేజతో నటించిన 'వీర, సారొచ్చారు' రెండు డిజాస్టర్స్‌గానే నిలవడం గమనార్హం. ఇక ఈ చిత్రం కోసం 'అమర్ అక్బర్ ఆంథోని' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారని సమాచారం. ఈ హిందీ మూవీ అంటే రవితేజకు భలే ఇష్టం. మరి ఈ చిత్రం టైటిల్‌ని చూస్తే ఇందులో రవితేజ మూడు షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాడా? లేక ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడా? అనే అనుమానం వస్తోంది.