నేడు ప్రతి చిత్రం విషయంలో ఆ సినిమా మేకర్స్ వివాదాలకు చోటిస్తే ఫ్రీపబ్లిసిటీ లభిస్తుందని భావించారు. నాడు 'దేనికైనా రెడీ నుంచి అర్జున్‌రెడ్డి' వరకు చివరకు స్టార్ అయిన విజయ్‌కి సైతం యావరేజ్ సినిమా కాస్త వివాదాల పుణ్యమా అని అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ ఉంది. యూనిట్‌లోని వారి చేతే లీకులు నుంచి టైటిల్, కథ ఇలా అన్ని మీడియాలో వచ్చేలా చూస్తారు. దానికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే ఓకే,.. లేదంటే ఇది అంతా భ్రమ.. విషయాలు తెలుసుకోకుండా రచ్చ చేస్తున్నారు అని సరిపెడుతుంటారు. ఇప్పుడు అదే పబ్లిసిటీ డిసెంబర్ 1న విడుదల కావాల్సిన 'పద్మావతి' విషయంలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై ఆరోపణలు, దాడులు జరుగుతున్నాయి.
రాజ్‌పుత్, కర్ణిసేనతో పాటు పలు హిందు సంస్థలు కూడా ఈ చిత్రం విషయంలో మండిపడుతున్నాయి. తమ రాజ్యాన్ని లొంగతీసుకోవాలని, మహారాణి పద్మావతిని వశం చేసుకోవాలని ముస్లిం రాజు అయిన ఖిల్జీ వస్తే ఆయనకు లొంగకుండా పద్మావతితో పాటు 16వేల మంది ఆ రాజ్యం మహిళలు ఆత్మాహుతి చేసుకున్నారని, కానీ ఈ చిత్రంలో రాణి పద్మావతికి ఖిల్జీకి మధ్య ప్రేమాయణం జరిగినట్టుగా చూపిస్తున్నారని ఉద్యమకారుల ఆందోళన. ఇక ఈ చిత్రంలో నిజంగా ఖిల్జీ, పద్మావతిల మధ్య ప్రేమాయణాన్ని చూపించారని, అయితే దానిని ఖిల్జీ తన ప్రేయసిగా పద్మావతిని ఊహించుకునే సీన్స్‌అని అంటున్నారు. నిజంగానే ఇందులో పద్మావతిని అవమానించారని ప్రజలు ఆందోళన చేస్తుంటే కనీసం ఆ కర్ణిసేన, రాజ్‌పుత్‌లకు నాయకులైన వారికి ముందుగా సినిమా చూపించి, అపోహలను ఎందుకు తొలగించరు? అని కొందరు వాదిస్తున్నారు.
ఇక భన్సాలీనే ఉద్యమకారుల ఆందోళనకు ముఖ్యకారణమని, గతంలో కూడా ఆయన హిందువులను కించపరిచే చిత్రాలు తీశారని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రదర్శిస్తున్న ధియేటర్‌పై దాడి జరగడంతో దీపికా పడుకోనే ఈ చిత్రాన్ని ఎవ్వరు ఆపలేరని, తాము సెన్సార్‌కి మాత్రమే జవాబుదారీగా ఉంటామని ఏవేవో వ్యాఖ్యలు చేసింది. దీంతో కర్ణిసేన దీపికాపడుకోనేను చంపితే 5కోట్లు నజరానా ఇస్తామని, ఆమె ముక్కుని కోయాలని స్పందించడంతో ఇప్పుడు వ్యవహారం మరింత ముదిరింది...!