జయేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, తమన్నాతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ఒకపక్క నిర్మాతగా, మరో పక్క హీరోగా ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్నారు. అటు నిర్మాతగా హిట్స్ లేని కళ్యాణ్ రామ్ కి ఎట్టకేలకు తమ్ముడు తారక్ తో తీసిన జై లవ కుశ హిట్ అవడంతో చానాళ్లకు నిర్మాతగా విజయం సాధించగలిగాడు. మరో పక్క దాదాపు పదేళ్లకు పటాస్ తో హిట్ అందుకున్నాడు. అలాగే మళ్ళి హీరోగా హిట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు.
ఒకపక్క జయేంద్ర తో సినిమాను చేస్తూనే మరోపక్క చందమామ కాజల్ తో కలిసి మంచి లక్షణాలున్న అబ్బాయి (ఎమ్యెల్యే) సినిమా కూడా చేస్తున్నాడు. ఇకపోతే జయేంద్ర దర్శకత్వంలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. జయేంద్ర దర్శకుడిగా ఒకప్పుడు 180 వంటి సినిమాతో ఆకట్టుకున్నాడు. అలాంటి దర్శకుడితో కలిసి కళ్యాణ్ రామ్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బృంద మాస్టర్ ఆధ్వర్యంలో... ఒక మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. అయితే కళ్యాణ్ రామ్ - తమన్నా కలిసి నటిస్తున్న ఈసినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అందుకే ఈసినిమా శాటిలైట్స్ హక్కులను జెమిని ఛానల్ వారు దాదాపు 4.75 కోట్లకు కొనేసినట్టుగా చెబుతున్నారు.
అయితే కళ్యాణ్ రామ్ - తమన్నాకి సంబందించి ఒక పిక్ నెట్ లో వైరల్ అయ్యింది. ఆ పిక్ లో కళ్యాణ్ రామ్, తమన్నా మీద అలా అలా వాలిపోయి... క్రేజీగా సాఫ్ట్ గా కనబడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ పిక్ లో తమన్నా ఎప్పటిలాగే మిల్కి బ్యూటీగా, అందంగా, స్టైలిష్ గా ఆకట్టుకుంటుంది. అయితే మరి తమన్నాకి ఈ మధ్యన హిట్ అనేదే లేకుండా పోయింది. అందుకే కళ్యాణ్ రామ్ పక్కనే కాదు.. సందీప్ కిషన్ వంటి మీడియం రేంజ్ హీరోపక్కన కూడా సినిమాలు ఒప్పేసుకుంటుంది. మరి తమన్నాకున్న క్రేజ్ వలనే ఈ సినిమాకి అంత భారీ మొత్తంలో శాటిలైట్స్ హక్కులు అమ్ముడయ్యాయనే ప్రచారం ఎంతవరకు కరెక్టో తెలియదు.