కథలు, రచన, సినిమా మీద ఒక్కో దర్శకుడిది, ఒక్కో రచయిత,ఒక్కో నిర్మాతల ఆలోచనలు వేరు వేరు గా ఉంటాయి. తాము చేయబోయే స్టార్స్ చిత్రాలను వారి ఇమేజ్‌ని, క్రేజ్‌ని పరిశీలించి కథలు రాస్తామని, సినిమాలు తీస్తామని కొందరు చెబుతారు. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి ఎవర్‌గ్రీన్ హిట్ ఫార్ములాలని వాటిని ఫాలో అవుతామని కొందరు అంటారు. తమ చిత్రాలలో నవరసాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని మరికొందరు సెలవిస్తారు.
ఏదైనా సరే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే భావోద్వేగాలు, నవరసాలు ఉండేలా కమర్షియల్ యాంగిల్‌లో ఉండేలా చూస్తామంటారు.మరి కొందరు ఎంటర్‌టైన్‌మెంట్‌ని మించినదే లేదని అందుకే తమ చిత్రాలలో ఆ ఎలిమెంట్‌ని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతారు.కానీ ప్రముఖ రచయిత, దర్శకుడు,రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం తాను రాసే కథలు, తాను కథలు అందించే చిత్రాలు ఎలా ఉంటాయో చెబుతూ తనదైన శైలిలో వివరించారు.
ఇక విజయేంద్ర ప్రసాద్ తన కుమారుడు రాజమౌళి దర్శకుడు కాకముందు నుంచే రచయిత, ఆయన బాలకృష్ణ నటించిన 'బొబ్బిలి సింహం', 'సమర సింహారెడ్డి'లకు కూడా పనిచేశాడు. కానీ ఆయన తన కుమారుడు రాజమౌళికి ఫ్లాప్ అనేదే లేకుండా రచనతలు చేస్తూ, 'మగధీర, ఈగ, బాహుబలి పార్ట్1,2, భజరంగీ భాయిజాన్' 'మెర్శిల్' చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించి ఇప్పుడు యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులు, మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఆయన తన చిత్రాల కథలు, ఆయా చిత్రాలు ఎలా ఉండాలో వివరించాడు.
ఓ భార్య ఎంతో నిజాయితీగా తనభర్త ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. స్వీట్స్‌తింటే షుగర్, కొలస్ట్రాల్ వంటివి వస్తాయని, ఇలా ప్రతి విషయంలోనూ భర్త గురించే ఆలోచిస్తుంది. కానీ వేశ్య అలా కాదు.. ఆమెకి కావాల్సింది డబ్బు. డబ్బు కోసం ఆమె ఏమైనా చేస్తుంది. సినిమా, వాటి కథలు కూడా అంతే. మనం చెప్పే పాయింట్‌లో భార్యలాగా నిజాయితీ ఉండాలి... వేశ్యలాగా ఎలాగైనా కలెక్షన్లు రాబట్టే సత్తా ఉండాలి. అలా రూపొందే చిత్రాలు ఎప్పుడు విజయవంతమవుతాయని చెప్పుకొచ్చాడు. ఈ పోలిక కాస్త ఇబ్బందిగా ఉన్నా... ఇది వాస్తవం. కాబట్టే రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌లు అదే రూట్‌లో వెళ్తూ విజయదుంధుబి మోగిస్తున్నారు.