ఈమధ్యనే ఇద్దరు హీరోలు దర్శకులను, కథలను మార్చుకున్నారు. దర్శకుడు బాబి రవితేజతో చిత్రం చేయాలని భావించాడు. అనిల్‌రావిపూడి ఎన్టీఆర్‌ని ఫిక్స్ చేసుకుని కథను కూడా వినిపించాడు. చివరికి ఈ ఇద్దరు హీరోలు, దర్శకులు ఒకరిని ఒకరు మార్చుకున్నారు. బాబి కాస్తా ఎన్టీఆర్‌తో 'జైలవకుశ' తీస్తే, అనిల్‌రావిపూడి రవితేజతో దిల్‌రాజు నిర్మాణంలో 'రాజా ది గ్రేట్' చిత్రం చేశాడు. మరోసారి ఇదే పని మరలా అనిల్‌రావిపూడికి ఎదురవుతోంది. విషయానికి వస్తే నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయనా', ఆయన కుమారుడు నాగచైతన్యతో 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ. ఈయన త్వరలో వెంకటేష్, నాగచైతన్యలతో ఓ మల్టీస్టారర్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు సీన్ మారింది. కొత్తగా దీనిలోకి అనిల్ రావిపూడి ఎంటర్ అయ్యాడు. వెంకటేష్ చిత్రం అనిల్‌రావిపూడికి వెళ్లింది. ఆయన వెంకటేష్‌తో పాటు రానా లేదా నాగచైతన్యలతో 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రం తీయడానికి రెడీ అవుతున్నాడు. దీనిని కూడా దిల్‌రాజే నిర్మించనున్నాడు. ఇక దిల్‌రాజు బేనర్‌లో గతంలో కూడా వెంకటేష్, మహేష్‌బాబుతో కలసి 'సీతమ్మవాకిట్లో.. సిరిమల్లెచెట్టు' వంటి మల్టీస్టారర్ చేశాడు. ఇక వెంకటేష్ అవకాశాన్ని పోగొట్టుకున్న రవితేజతో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు. అంటే 'రాజా ది గ్రేట్' లో రవితేజతో పనిచేసిన అనిల్‌రావిపూడి వెంకీతో చేస్తుంటే... వెంకీతో సినిమా చేయాలని భావించిన కళ్యాణ్‌కృష్ణ రవితేజతో సినిమా చేయనున్నాడు.. సినిమా పరిశ్రమలో ఇలాంటి కుండ మార్పిడులు, కుడి ఎడమ కావడం తరచుగా జరిగేదే...!