అక్కినేని ఫ్యామిలీ హీరోలకి క్లాస్ హీరోలుగా, రొమాంటిక్ హీరోలుగా మంచి పేరు ఉంది. అక్కినేని అయితే 60దాటిన వయసులో కూడా 20ఏళ్ల శ్రీదేవి నుంచి ఎందరితోనే ఆడిపాడి రొమాన్స్ చేశాడు. ఏయన్నార్ నటించిన పూర్తి యాక్షన్ చిత్రాలు పెద్దగా లేవు. వచ్చినా ఆడలేదు. అదే ఇమేజ్ నాగ్ కెరీర్‌లో కూడా ఉంది. కానీ ఆయన 'శివ'తో పాటు పలు యాక్షన్ చిత్రాలలో మెప్పిస్తూనే మరోపక్క రొమాంటిక్ యాంగిల్‌లో 'గీతాంజలి, నిన్నేపెళ్లాడతా, మన్మథుడు' వంటి రొమాంటిక్ చిత్రాలలో చేసి అక్కినేని ఫ్యామిలీ హీరోలలో అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని మెప్పించిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక నాగచైతన్య మాత్రం ఇప్పుడిప్పుడే యాక్షన్ చిత్రాలలో నటిస్తూ, తనదైన తండ్రి వంటి బ్రాండ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ విషయంలో ఇప్పటివరకు ఆయన సక్సెస్ కాకపోయినా భవిష్యత్తులోనైనా ఆ టార్గెట్ రీచ్ అవుతాడని అక్కినేని అభిమానుల నమ్మకం.
మరోవైపు అక్కినేని అఖిల్ మాత్రం యాక్షన్‌ని, మాస్ హీరోయిజంని చూపించాలని మొదటి చిత్రం నుంచే మొదలుపెట్టాడు. నిజానికి మన వయసుకు మనం గౌరవం ఇవ్వడం అవసరం. మన వయసు, మన బలహీనతలు, బలాలు తెలుసుకోవడం కొందరికే సాధ్యం. కానీ కొందరు తాతయ్యల వయసులో కూడా నాగ్‌తోటి సహచర స్టార్స్ ఇంకా కుర్రహీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ, మాస్ స్టెప్పులు వేస్తున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఈ వయసులో కూడా మమ్మల్ని యాక్షన్ హీరోలగానే కాకుండా లవర్‌బోయ్‌గా కూడా ఆదరిస్తున్నారని, ప్రేక్షకులు ఆదరించినంత కాలం తాము అలాగే చేస్తామని చెబుతుంటారు. ఈ విషయంలో నాగార్జునది కాస్త వైవిధ్యమైన బాట. ఆయన అమితాబ్‌లాగా వయసుకి విలువ ఇస్తాడు. నాగ్ కూడా అంతే. ఆమధ్య ఆయనే తనను ఇక యువ సామ్రాట్ అని గానీ, మన్మథుడు, గ్రీకువీరుడు వంటి పేర్లతో పిలవవద్దని, తనకు హీరోలైన కుమారులు ఉన్నారని, కావాలంటే వారిని అలా పిలుచుకుని తనను కింగ్ అని పిలవమని చెప్పాడు. ఇక ఈ మద్య నాగ్ కూడా 'ఓం నమో వేంకటేశాయ', 'రాజుగారి గది2'లలో హీరోయిన్లు లేకుండా చేశాడు.
గతంలో 'అన్నమయ్య, శ్రీరామదాసు'వంటి చిత్రాలలో నాగ్‌కి ఉన్న మన్మథుడి ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని రాఘవేంద్రరావు రొమాన్స్, డ్యూయెట్స్ వంటి సినిమాటిక్ సీన్స్ పెట్టాడు. కానీ ఇప్పుడు వర్మ-నాగ్ ఇద్దరు కలిసి పూర్తిగా సీరియస్ మోడ్‌లో, ఓన్లీ యాక్షన్‌ని నమ్ముకుని చిత్రం చేస్తున్నారు. ఇందులో టబు నటిస్తోందని, తర్వాత అనుష్క అని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో నాగ్ క్యారెక్టర్‌కి హీరోయిన్‌గానీ, రొమాన్స్, డ్యూయెట్స్ ఉండవని తెలుస్తోంది. కేవలం ఓ ఐటం సాంగ్ ఉంటుందిట. అయితే మరో లేడీ లీడ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది గానీ ఆ పాత్రకి నాగార్జునకి మద్య రొమాన్స్ ఉండదట. ఇలా సీరియస్‌గా,డార్క్ చిత్రాలు తీయడంలో వర్మ నేర్పరి. సో.. నాగ్ ఇమేజ్‌ని ఈ చిత్రంతో వర్మ పూర్తిగా మార్చేస్తాడనే భావించవచ్చు.