గత కొన్నిరోజులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించబోయే మలీస్టారర్ మీదనే అందరి చర్చ సాగుతోంది. ఫోటోతో జక్కన్న క్లూ ఇస్తే ఏకంగా సాయిధరమ్‌తేజ్ దానిని నిజమేనని తేల్చాడు. దాంతో ఈ చిత్రం ఎలా ఉండనుంది? బడ్జెట్ ఎంత? నేపధ్యం ఏమిటి? ఇద్దరి పాత్రలు ఏమిటి? ఇలాంటి పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు జక్కన్న క్లారిటీ ఇచ్చే దాకా మన అభిమానులు వెయిట్ చేసే ఓపిక లేదు. దాంతో వారే బడ్జెట్‌ని, పాత్రలను, బ్యాక్‌డ్రాప్‌లని కూడా వార్తల రూపంలో వండేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఒకరు మాత్రమే పూర్తి స్థాయి హీరో అయితే రెండో స్టార్ కేవలం కాసేపు కనిపించే పాత్ర అంటున్నారు. అంటే వారి దృష్టిలో ఇది 'ఎవడు' టైప్ చిత్రం అన్నమాట..!
మరికొందరు బాక్సింగ్ నేపధ్యంలో చిత్రం ఉంటుందని, ఇద్దరు స్టార్స్‌ని బాక్సింగ్ చాంపియన్లుగా కనిపించేందుకు ఫిజిక్, బాడీ పెంచమని రాజమౌళి చెప్పేశాడంటున్నారు. ఇక ఆల్‌రెడీ విజయేంద్రప్రసాద్, రాజమౌళిలు ఓ పాయింట్ అనుకుని ఎన్టీఆర్, చరణ్‌లకి చెప్పారని అంటుంటే. కాదు.. రాజమౌళి ఏ పాయింట్‌ని చెప్పకపోయినా ఆయన మీద ఉన్న నమ్మకంతో వారు ఓకే చెప్పేశారనేది మరోవార్త. ఇక ఈ చిత్రం రెమ్యూనరేషన్సే 150 కోట్ల వరకు అవుతుందని, సినిమా బడ్జెట్ 180కోట్లని అంటున్నారు. మరికొందరు ఈ చిత్రానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు పారితోషికం తీసుకోకుండా ఆ ముగ్గురితో పాటు నిర్మాత దాయయ్య వాటా కలుపుకుని లాభాలలో నాలుగు వాటాలు తీసుకుంటారని చెబుతున్నారు.
ఇక ఈ చిత్రం కథ 'భజరంగీ భాయిజాన్' సమయంలోనే సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ కోసం తయారు చేసుకున్న కథ అని, నెగటివ్ టచ్‌లో ఉండే షారుఖ్ పాత్ర ఎన్టీఆర్‌కి, పాజిటివ్ పాత్ర రామ్‌చరణ్‌కి నచ్చాయంటున్నారు. ఇది కాస్త నిజమయ్యే సూచనలు ఉన్నాయి. ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ సల్మాన్, షారుఖ్ కోసం ఓ కథ రాశానని చెప్పాడు. మొత్తానికి జక్కన్న క్లారిటీ ఇచ్చే లోపు ఇంకా 'అట' అనే వార్తలు వస్తాయో వేచిచూడాలి...!