మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడు ఒకే లుక్‌లో కనిపిస్తారని, వారికి మేకోవర్‌పై నమ్మకం లేదని గతంలో బాలీవుడ్ మేకర్స్ జోక్‌లు వేసేవారు. కానీ 'దేశముదురు'తో మొదలుకుని మన హీరోలు కూడా సిక్స్‌ప్యాక్‌లు, గడ్డాలు, మీసాలు, ఇలా గ్యాప్ దొరికితే చాలు మేకోవర్‌పై దృష్టి పెడుతున్నారు. ఇక తమిళ తంబీలకు బొద్దుగుమ్మలంటే బాగా ఇష్టం. అలాగని వారి కోసమే బొద్దుగా ఉంటే మాత్రం మిగిలిన భాషల్లో అవకాశాలు తగ్గుతాయి. నేటి హీరోయిన్లు ఫిట్నెస్‌పై దృష్టి పెట్టి జిమ్‌లు, యోగాలలో కనిపిస్తున్నారు. 'సైజ్‌జీరో' పుణ్యమా అని బరువెక్కి, తర్వాత నాజూకుగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అనుష్క. అందులోనూ ఆమె స్వయంగా యోగా టీచర్. ఇక పలు ట్రీమ్‌మెంట్స్, సర్జరీలు, కేరళ వెయిట్‌లాస్ పద్దతుల ద్వారా మరలా ఆమె తన పాత అందాలను సంతరించుకుని తాజాగా సోషల్‌మీడియాలో తన ఫొటోలని కూడా పోస్ట్ చేసింది.
ఇక త్రిష, నయనతార, శ్రియ, తమన్నా వంటి వయసు మళ్లిన హీరోయిన్లు కూడా తమ సౌందర్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక నేటితరం హీరోయిన్లలో ఫిట్‌నెస్ గురించి చెప్పాలంటే రకుల్‌ప్రీత్‌సింగ్, సమంతలను ఉదాహరణగా చెప్పాలి. వారి ఫిట్నెస్ చూసి రామ్‌చరణ్ శ్రీమతి ఉపాసన నుంచి అందరు వారిని ఫాలో అవుతున్నారు. మరోవైపు కేరళ వైద్యం ద్వారా ఇప్పటికే రాశిఖన్నా, హన్సికలు కూడా స్లిమ్‌గా మారారు. ఇక తాజాగా హన్సిక తన సోదరుడు ప్రశాంత్ పెళ్లి వేడుకలలో హడావుడి చేసింది. మెహందీ వేడుక నుంచి పెళ్లి వేడుక వరకు అన్ని తానై హంగామా చేసింది. ఆట పాటలతో అలరించింది. ఇది ఆమె పెళ్లి వేడుకా? లేక సోదరుడి పెళ్లి వేడుకా? అనే అనుమానం వచ్చేంతగా యాక్టివ్‌గా ఉంది.
ఇక ఈమె ఈ పెళ్లి వేడుకల ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టగా ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో హన్సిక బొద్దు గుమ్మ అవతారం నుంచి ఎంతో నాజూకుగా, సన్నగా కనిపిస్తుండటంతో అందరూ వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రభుదేవాతో కలిసి 'గులేభకావలి' చిత్రంలో నటిస్తోంది. మరి ఈ స్లిమ్‌నెస్ వల్ల ఆమెకి మిగిలిన భాషల్లో కూడా అవకాశాలు వస్తాయో? లేక ఉన్న తమిళ అవకాశాలు కూడా పోతాయో వేచిచూడాల్సివుంది...!