ప్రభాస్‌తో తమిళ సీనియర్ స్టార్ సత్యరాజ్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది. వీరు 'మిర్చి' చిత్రంలో కలిసి నటించారు. ఇక 'బాహుబలి'లో ప్రభాస్‌తో పాటు కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఇరగదీశాడు. ఈ చిత్రం రెండు పార్ట్‌ల కోసం ప్రభాస్, సత్యరాజ్‌లు దాదాపు నాలుగేళ్లు జర్నీ చేశారు. అదే ఇప్పుడు సత్యరాజ్‌కి మంచిని చేసింది. విషయానికి వస్తే కిందటేడాది వచ్చిన 'క్షణం' చిత్రం తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తమిళ రీమేక్‌ను సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ హీరోగా చేస్తున్నాడు. మొదటగా ఈ చిత్రం హక్కులను తీసుకోమని, బాగుంటుందని సలహా ఇచ్చింది ప్రభాసేనట.
సత్యరాజ్ మాట్లాడుతూ.. 'బాహుబలి' షూటింగ్‌లో నేను ఉండగా, నా కుమారుడు శిబిరాజ్ ఫోన్ చేసి 'క్షణం' చిత్రం గురించి ఎంక్వైరీ చేయమన్నాడు. నేను వెంటనే పక్కన ఉన్న ప్రభాస్‌ని 'క్షణం' గురించి అడిగాను. దానికి ఆయన ఎందుకు అన్నారు? ఏం లేదు.. ఈ చిత్రం రీమేక్‌ని మా అబ్బాయ్ చేయాలనుకుంటున్నాడని చెప్పాను. ఖచ్చితంగా చేయండి. మంచి సినిమా అవుతుంది అని నాకు నమ్మకం కలిగించాడు. ఇక ఈ చిత్రం రీమేక్ చేయాలని అనుకుంటున్న సమయంలోనే హీరో విజయ్‌ఆంటోని నాకు ఫోన్ చేశాడు. ఈ చిత్రానికి దర్శకునిగా ఎవరిని పెట్టుకుంటున్నారు? అని అడిగాడు. ఇంకా ఎవ్వరినీ ఫైనలైజ్ చేయలేదని చెప్పగానే 'సైతాన్'గా, తెలుగులో 'భేతాళుడు'గా వచ్చిన చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్‌కృష్ణమూర్తిని పెట్టుకోండి. బాగా తీస్తాడు. ఎంతో టాలెంట్ ఉంది అని చెప్పాడు.
ఇక ఈ చిత్రానికి మేం 'సత్య' అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ఇది కమల్‌హాసన్ దగ్గర ఉన్న టైటిల్. నేను అడగగానే ఆ టైటిల్‌ని మాకు ఇచ్చారు. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ని సూర్య లాంచ్ చేశాడు అని చెప్పుకొచ్చాడు . ఇందులో శిబిరాజ్‌తో పాటు రమ్యనంబీశన్ నటించగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకమైన పాత్రను పోషించింది. మరి ఈ చిత్రం తెలుగులోలాగానే తమిళంలో కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో యూనిట్ ఉంది. మొత్తానికి తన కుమారుడి చిత్రం కోసం సత్యరాజ్ ప్రభాస్, విజయ్‌ఆంటోని, కమల్‌హాసన్, సూర్య.. ఇలా అందరి సహకారాన్ని తీసుకున్నాడు.