నవంబర్ నెల మొత్తం చిన్న చితక.. సినిమాలన్నీ వరసబెట్టి థియేటర్స్ లోకి దిగిపోయాయి. అసలా సినిమాలు ఎప్పుడు తెరకెక్కాయి.. అందులోని నటీనటులు ఎవరనేది కూడా ప్రేక్షకుడికి తెలియకుండానే.. ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం పోవడం జరిగిపోయాయి. వారానికి ఏడెనిమిది సినిమాలు థియేటర్స్ లోకి వచ్చినా.. ఏ సినిమాని ప్రేక్షకుడు ఆదరించని పరిస్థితి. అయితే నవంబర్ నెల మొత్తం తమిళ డబ్బింగ్ సినిమాల హవాతో తెలుగులోని చిన్న సినిమాలన్నీ కట్టకట్టుకుని కొట్టుకుపోయాయి. అసలు ఇప్పుడు వారానికి మినిమం 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
అయితే థియేటర్లు మాత్రం ఖాళీ. ఏ ఒక్క సినిమా ఆకట్టుకునేలా లేకపోవడంతో.. థియేటర్లన్నీ బోసిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే 144 సెక్షన్ పెట్టినట్టు తయారయ్యాయి సినిమా హాళ్లు. మార్కెట్లో బోలెడు సినిమాలు ఉన్నాయి. కలెక్షన్లు మాత్రం లేవు. ఇప్పుడీ గుంపులోకి చేరేందుకు మరో అరడజను సినిమాలు రెడీ అయ్యాయి. డిసెంబర్ 1 న జవాన్ విడుదలై మిశ్రమ స్పందనతో కలెక్షన్స్ కొల్లగొడుతుంటే... ఇప్పుడు తాజాగా ఈ వీకెండ్ ఏకంగా 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. థియేటర్ల సమస్య లేదు. ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి.
కానీ ఎటొచ్చి ఈ 6 సినిమాల్లో ఎన్ని క్లిక్ అవుతాయో అనేది చూడాలి. అయితే ఈ 6 సినిమాల్లోనూ సప్తగిరి ఎల్ ఎల్ బి, మళ్లీ రావా అనే సినిమాలు మాత్రమే కాస్త ఇంట్రెస్ట్ ని కలిగించే సినిమాలు. ఇక మిగతా సినిమాలన్నీ గుంపులో గోవిందయ్య అన్నట్టే ఉన్నాయి. ఇకపోతే ఈ వారంలో థియేటర్లలోకి వస్తున్న సినిమాలివే. కమెడియన్ సప్తగిరి నటించిన సప్తగిరి ఎల్ ఎల్ బి డిసెంబర్ 7న విడుదలవుతుంటే.. సుమంత్ నటించిన మళ్ళీ రావా డిసెంబర్ 8న విడుదలవుతుంది. అలాగే ప్రేమిక, బీటెక్ బాబులు, వానవిల్లు, ఆకలి పోరాటం కూడా డిసెంబర్ 8నే విడుదలవుతున్నాయి. చూస్తుంటే నవంబర్ నెల పరిస్థితి డిసెంబర్ లోను రిపీట్ అయ్యేలాగే కనబడుతుంది.