'సూపర్' సినిమాతో తెలుగుతెరకి వచ్చిన స్వీటీ అనుష్క ఆ తర్వాత తనదైన గ్లామర్ పాత్రలతో దూసుకుపోతూ నేటి సీనియర్ స్టార్స్ నుంచి యంగ్‌హీరోల వరకు అందరి సరసన నటించింది. అయితే ఆమె కెరీర్‌ని మలుపుతిప్పిన చిత్రం మాత్రం 'అరుంధతి'. ఎంతో లేట్‌గా విడుదలైనా కూడా ఈ చిత్రం తెలుగునాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దాంతో ఒక్కసారిగా స్వీటీ అనుష్క కాస్తా జేజెమ్మగా మారిపోయింది. అక్కడి నుంచి ఆమె ఏ చిత్రంలో నటించినా కూడా ఆమె పాత్రకు కూడా మంచి నటనకు స్కోప్ ఉండేలా దర్శకనిర్మాతలు, హీరోలు చూసుకున్నారు. అలా గ్లామర్ పాత్రలను చేస్తూనే 'వర్ణ, సైజ్‌జీరో' వంటి ఫ్లాప్‌లు వచ్చినా, 'రుద్రమదేవి, బాహుబలి' వంటి చిత్రాలలో క్రేజీ నటిగా మెప్పించింది.
ఇక 'సైజ్‌జీరో'తో బాగా బరువు పెరిగిన అనుష్క తానే యోగాటీచర్‌ని అయి ఉండి కూడా బరువు తగ్గేందుకు నానా తిప్పలు పడింది. అన్ని వ్యాధులకు, రోగాలకు మూలకారణంగా చెప్పుకునే ఓబేసిటీ ఆమెని బాగా ఇబ్బందే పెట్టింది. 'బాహుబలి-ది కన్‌క్లూజన్'లోని దేవసేన పాత్ర తర్వాత కేవలం యువి క్రియేషన్స్ బేనర్‌లో రూపొందుతూ, 'పిల్లజమీందార్' ఫేమ్ జీ.అశోక్ దర్శకత్వం వహిస్తున్న 'భాగమతి' చిత్రంలో చేస్తోంది. మధ్యలో వచ్చిన 'సింగం2, నమో వేంకటేశాయ' చిత్రాలలో కూడా ఆమె ఫిట్నెస్‌పై పలు విమర్శలు వచ్చాయి. మరి దాని వల్లనో ఏమో ఆమె 'భాగమతి' తప్ప ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. 'సాహో, రాంగోపాల్‌వర్మ-నాగార్జునల చిత్రాలలో నటిస్తోందని వార్తలు వచ్చినా అవి అబద్దమని తేలిపోయింది.
ఇక ఆమెను నాజూకుగా చూపించేందుకు 'బాహుబలి'తో పాటు ఇప్పుడు 'భాగమతి' టీం కూడా ఎంతో కష్టపడి స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణులకు ఆ బాధ్యతలు అప్పగించారు. మరి అవకాశాలు రావడం లేదో లేక తానే ఒప్పుకోవడం లేదో తెలియదు గానీ ఆమె కొత్తగా ఇప్పటివరకు ఒక్క చిత్రాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈమె ఓవర్‌వెయిట్ వల్ల ఆమెకి నడుం నొప్పి కూడా తీవ్రంగా బాధిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయని తెలిసి ఆమె ప్రస్తుతం కేరళ ఆయుర్వేద చికిత్సను పొందుతోందని తెలుస్తోంది. మరోవైపు ఈమె అజిత్ నటించే తదుపరి చిత్రం 'విశ్వాసం'తో పాటు తేజ-వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందే చిత్రాలలో కూడా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.