ప్రణీత.. ఈ భామని మన తెలుగు ప్రేక్షకులు దాదాపు మర్చిపోయే స్థితిలో ఉన్నారు. ఈ కన్నడ భామ అక్కడ 'పోకిరి' చిత్రంలో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో 'ఏం పిల్లో.. ఏం పిల్లడో, బావ' చిత్రాలలో సోలో హీరోయిన్‌గా నటించింది. 'అత్తారింటికి దారేది' చిత్రంతో త్రివిక్రమ్ -పవన్ వంటి కాంబినేషన్‌లో సెకండ్ హీరోయిన్‌గానే అయినా గోల్డెన్ ఛాన్స్‌ని కొట్టేసింది. ఇక నిజం చెప్పాలంటే 'అత్తారింటికి దారేది'లో సమంత కంటే ఎక్కువ మార్కులు ఆమెకే పడ్డాయి. అదే సమయంలో ఆమె సినిమాల ఎంపికలో తప్పు చేసింది. 'పాండవులు పాండవులు తుమ్మెద, డైనమైట్' వంటి చిత్రాలలో నటించి తప్పు చేసింది. 'రభస' ఫ్లాప్ కావడం కూడా ఆమెకి దురదృష్టంగా పరిణమించింది.
ఇక ఈమె ఆ తర్వాత కన్నడ, తమిళ, మలయాళ భాషలపై దృష్టి పెట్టింది. కార్తీ సరసన 'శకుని', సూర్య సరసన 'మాస్' చిత్రాలలో నటించింది. అంతే కాదు నెగిటివ్ రోల్స్‌తో పాటు అన్ని తరహా పాత్రలను చేస్తోంది. కానీ ఆమె నటించిన చిత్రాలన్నింటికి అదేంటో ఆమె మైనస్ అనే విశ్లేషణలు, చెడ్డ పేరు వస్తోంది. తనలో అందం ఉంది. టాలెంట్ ఉంది. కేవలం కళ్లతోనే అభినయించే సామర్ధ్యం ఉన్నా కూడా తన పాత్రలకు ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం, ఆమె టాలెంట్‌ని అందరూ విమర్శిస్తుండే సరికి పాపం.. ఆమె ఎందుకిలా నా విషయంలోనే జరుగుతోందని బాధపడుతూ ట్వీట్ చేసింది. అయినా నాకంటూ ఓ టైం వస్తుందని తనకు తాను ఓదార్చుకుంటోంది ఈ కన్నడ భామ.