నేడు విక్టరీ వెంకటేష్ అంటే సీనియర్ స్టార్‌గా ఎంతో పేరుంది. ముఖ్యంగా లేడీస్‌లో శోభన్‌బాబు తర్వాత వెంకీకి అంత పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇక ఈయన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలలో ఒకడు. వెంకటేష్‌కి ముందు పెద్దగా నిర్మాత కుమారులు ఎవరూ హీరోలుగా మారి స్టార్స్ అయినా దాఖలాలు లేవు. కానీ రామానాయుడు గారు వెంకీతో దానిని నిజం చేశాడు. ఇక విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే ఆయన సినీ ఇండస్ట్రీ కెరీర్ అనుకోని విధంగా మొదలైంది. కృష్ణ, శోభన్‌బాబు హీరోలుగా మల్టీస్టారర్‌గా డా.రామానాయుడు 'ముందడుగు' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత రామానాయుడు మరోసారి కృష్ణ కాల్షీట్స్ అడిగారు. రాఘవేంద్రరావు, పరుచూరి బ్రదర్స్ పనిచేస్తేనే డేట్స్ ఇస్తానని కృష్ణ రామానాయుడుకి చెప్పాడు. దాంతో రామానాయుడు రాఘవేంద్రరావుని, పరుచూరి బ్రదర్స్‌ని కలిసి ఒప్పించి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చాడు. కానీ కృష్ణ మాత్రం మరో నిర్మాతకి కూడా కమిట్‌మెంట్ ఇచ్చాను. ఈ చిత్రాన్ని మీ ఇద్దరు భాగస్వామ్యంతో చేసుకోండి అని చెప్పారు. దాంతో రామానాయుడు హర్ట్ అయ్యారు.
అప్పుడు ఆయన రాఘవేంద్రరావు, పరుచూరి బ్రదర్స్‌తో... ఒకవైపు రాఘవేంద్రరావు, మరో వైపు పరుచూరి బ్రదర్స్, మరో వైపు రామానాయుడు ఉన్నా కూడా ఎవ్వరి కాల్షీట్స్ దొరకడం లేదు ఏంది? అని నవ్వేశారు. అప్పటికే కృష్ణ కోసమే గాక చిరంజీవి, బాలకృష్ణ, శోభన్‌బాబు వంటి వారి కోసం ప్రయత్నించినా అది వీలు కాలేదు. దాంతో పరుచూరి బ్రదర్స్ అనుకోకుండా... మీ వెంకటేష్‌బాబునే హీరోని చేయవచ్చు కదా..! అనేశారు. అప్పుడు సురేష్‌బాబు, వెంకటేష్‌లు ప్రొడక్షన్ పనులు చూస్తున్నారు. దానికి రామానాయుడు ఏం రాఘవేంద్రరావు ఏమంటావు? అన్నారు. ఆయన పరుచూరి బ్రదర్స్ వంద రోజులు ఆడే కథ ఇస్తే చేయడానికి నేను రెడీ అన్నాడు. అప్పుడు పరుచూరి బ్రదర్స్ కలుసుకుని నాడే మాస్ హీరోలుగా కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణలకి ఇమేజ్ ఉండటంతో కొత్త కుర్రాడు కాబట్టి పూర్తి మాస్‌గా కాకుండా కాస్త నెగటివ్ టచ్ ఇస్తూ ఫస్టాఫ్ నడిపి, సెకండ్‌హాఫ్‌లో హీరోయిజం చూపించాలని డిసైడ్ కావడం దాంతో విక్టరీ వెంకటేష్, ఖుష్బూ జంటగా 'కలియుగ పాండవులు' రావడం జరిగింది.