దేశంలో ఎందరో సెలబ్రిటీలు ఉన్నారు. ప్రతి వారికి వారి వారి స్థాయిలలో ఇమేజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌లు ఉన్నాయి. అంతవరకు ఓకే... కానీ ఆ అభిమానమే పెచ్చుమీరితే ఎలా ఉంటుందో అటు పవన్ వీరాభిమానుల ప్రవర్తన, మరో వైపు టిడిపి, వైసీపీపై ఉన్న వీరాభిమానులను చూస్తే అర్దమవుతుంది. పవన్‌ని ఒక్క మాటంటే చాలు పవన్ అభిమానులు చంపేస్తాం.. పొడిచేస్తాం అంటారు. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్ అభిమానులు కూడా ఏం తక్కువ తినలేదు. ఇక వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్‌ని ఓ రాజకీయనాయకుడిలా కాకుండా తమ కుల ప్రతినిధిగా, ఓ కులానికి ఆరాధ్యదైవంగా భావిస్తూ ఆయన అభిమానులు కూడా పేట్రేగిపోతున్నారు. ఒకవైపు జనసేన, టిడిపి, మరో వైపు వైసీపీల పుణ్యమా అని సోషల్‌మీడియా చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని నాటి నూతన్‌ప్రసాద్ చెప్పిన 'దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని' డైలాగ్ చెప్పినట్లుగా ఇప్పుడు మనం ఆ డైలాగ్‌ని మార్చుకోవాల్సివస్తుంది.
ఇక తాజాగా వైసీపీకి, హీరో నితిన్‌కి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి ఫ్యాన్ అయిన గుంటూరుకు చెందిన తియ్యగూర వెంకటరెడ్డి విషయం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. అతను ఓ వ్యాపారి. ఆయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఇటీవల జనసేనాధిపతి పవన్.. జగన్‌ని బాగా విమర్శిస్తూ, వైసీపీని చూస్తే భయమేస్తోందని, దోచుకున్న వారు పాలకులైతే ఆ ప్రభావం సమాజం మొత్తం మీద ఉంటుందని, ప్రతిపక్షంగా జగన్ చేయాల్సిన పనిని తాను చేస్తున్నానని విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ శ్రేణులు పవన్ మాట వింటేనే కుతకుతలాడుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలు వైసీపీ వీరాభిమాని అయిన వెంకటరెడ్డికి కూడా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.
దాంతో ఆయన జగన్‌ని పవన్ ఏమైనా విమర్శిస్తే పవన్‌ని చంపేస్తామని బెదిరిస్తూ ఓ వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడం సంచలనం సృష్టించింది. దాంతో వెంటనే గుంటూరు అర్బన్ పోలీసులు అప్రమత్తమై నిందితుడిని అరెస్ట్ చేశారు. వెంకటరెడ్డి మాత్రం తాను మద్యం సేవించిన మత్తులో అలా మాట్లాడి వీడియోని సోషల్ మీడియాలో పెట్టానని చెబుతున్నాడు. ఇలా అభిమానం అందరిలో వెర్రితలలు వేస్తోంది.