ఘట్టమనేని ఫ్యామిలీకి శాఖమూరి ఫ్యామిలీకి మంచి దగ్గరి బంధుత్వం ఉంది. గతంలో శాఖమూరి కుటుంబంలోని పలువురు నిర్మాతలుగా, కృష్ణ, రమేష్‌బాబు, మహేష్ వంటి వారి మేనేజర్లుగా, వారి డేట్స్‌ని కూడా చూసేవారు. ఇక తాజాగా మహేష్‌కి మామయ్య వరస అయ్యే శాఖమూరి రాంబాబు మృతి చెందారు. ఈయనకు 'పద్మాలయా రాంబాబు'గా పేరుంది. ఈయన గతంలో రమేష్‌బాబు హీరోగా ఓ చిత్రాన్ని కూడా నిర్మించాడు. మహేష్‌కి పర్సనల్ మేనేజర్‌గా కూడా పనిచేశాడు. ఇక ఈయన మరణం పట్ల ఘట్టమనేని కుటుంబ సభ్యులు, ఇతరులు , సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపి ఆయనను కొనియాడారు.
కృష్ణ హీరోగా మంచి ఊపులో ఉన్న సమయంలో ఎందరో శాఖమూరి వారు ఆయనతో ఎన్నో చిత్రాలు తీసేవారు. తమకంటూ పద్మాలయా స్టూడియోస్ వంటి సొంత బేనర్ ఉన్నప్పటికీ కృష్ణ ఇతర నిర్మాతలతో పాటు తనకు బంధువులైన వారికి కూడా ఎన్నో సినిమాలు చేసి వారి ఆర్ధికంగా నిలదొక్కుకునేలా, నిర్మాతలుగా పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేశారు. రమేష్‌బాబు విషయంలో కూడా అదే జరిగింది. కానీ మహేష్‌బాబు మాత్రం ఎక్కువగా తన బంధువులతో అసలు సినిమాలు చేయడు. తన సోదరుడు, సోదరికి రెండు మూడు చిత్రాల చేసిన ఆయన ఆ తర్వాత బయటి నిర్మాతలనే తప్ప ఎక్కువగా మంచితనానికి పోయి బంధువులకు చాన్స్‌లు ఇవ్వడం వంటివి చేయడం లేదు. తన తండ్రి మొహమాటం, మంచితనం వల్ల ఎంతో పొగొట్టుకున్నాడని, ఆ విషయంలో మాత్రం తాను తన తండ్రి బాటలో నడవనని మొదటి నుంచి మహేష్ చెబుతూనే వస్తున్నాడు.