శుభలేఖ చిత్రంలోనటించి ఆ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నవాడు శుభలేఖ సుధాకర్. సన్నగా పీలగా కనిపించే ఆయన నాడు హీరోల స్నేహితుడిగా ఓ వెలుగు వెలిగాడు. రెండు మూడు చిత్రాలలో క్రూరమైన విలన్ పాత్రలు కూడా చేసి మెప్పించాడు. ఇక ఆయన తాజాగా మాట్లాడుతూ, వైజాగ్‌లో బికాం చేశాను, నటనపై ఉన్న ఆసక్తితో చెన్నై వెళ్లాను. అప్పటివరకు నాకు మా నాన్న డబ్బులు పంపేవాడు. కానీ నా కాళ్లమీద నేను నిలబడాలని భావించాను.
అంతలోనే ఓ హోటల్‌లో క్యాషియర్ కావాలనే ప్రకటన వచ్చింది. దాంట్లో చేరి, సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నాకు అమితాబ్‌బచ్చన్ అంటే ఎంతో ఇష్టం. అప్పటికే కెమెరామెన్ గోపాల్‌రెడ్డి అమితాబ్‌తో పనిచేశారు. ఒకనాడు అమితాబ్ చెన్నైలో బస చేశారని తెలుసుకుని గోపాల్‌రెడ్డి నన్ను కూడా ఆ హోటల్‌కి తీసుకెళ్లాడు. కానీ అమితాబ్ పిలిచింది కేవలం గోపాల్‌రెడ్డి గారినే. దాంతో మీరు లోపలికి వెళ్లండి. మీరు ఆయనకు చెప్పి నన్ను పిలిస్తే లోపలికి వస్తాను. లేకపోతే వెళ్లిపోతాను అని చెప్పాను. ఆ తర్వాత గోపాల్‌రెడ్డిగారు ఆ గదిలోకి వెళ్లారు.
కాస్త సమయం తర్వాత స్వయంగా అమితాబ్ గారే తలుపుతీసి.. మిస్టర్ సుధాకర్. మీరు గోపాలరెడ్డిగారికి స్నేహితులైతే నాకు కూడా స్నేహితులే. లోపలకి రండి అని ఆహ్వానించడం మర్చిపోలేని ఘటన. ఇక నా శ్రీమతి శైలజ ఎంతో సీరియస్‌గా కనిపిస్తుంది గానీ ఆమెకి ఎంతో సెన్సాఫ్‌హ్యూమర్ ఉంది. ఆమె నిండు కుండ. తొణకదు.. బెణకదు. కానీ నాలో నాకు నచ్చని గుణం మంచితనం. కష్టాలంటే ఏమిటో, ఆకలి బాధ ఏమిటో నాకుతెలుసు. దాంతో అడిగిన వారికి సహాయం చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు కొందరు నా మంచితనాన్ని ఉపయోగించుకున్నారని తెలుసుకుని, బాధపడ్డాను. అయినా నేను మారను. నేను అలాగే ఉంటాను.. అని చెప్పుకొచ్చాడు.