సినిమాగా తీయలేని కథలను వెబ్‌సిరీస్‌గా తాను తీయాలని భావిస్తున్నానని, కానీ కొందరు మాత్రం పదే పదే అదే అడుగుతూ, రామాయణం అంతా విన్నా రామునికి సీతేమవుతుంది.. అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు అని వర్మ మండిపడ్డాడు. కొన్ని దశాబ్దాల ముందు కడప ఎలా ఉండేదో తాను తీస్తున్నానని, కడప ఫ్యాక్షనిజం గురించి ఇంటర్‌నెట్‌లో ఎన్నో వ్యాసాలున్నాయి. కడప గత చరిత్ర తెలుసుకోని వారు అజ్ఞానంలో ఉన్నట్లే. 'కడప' వెబ్‌సిరీస్ ఎంతో హింసాత్మకంగా ఉంటుందని మరోసారి చెబుతున్నాను. నచ్చిన వారు చూస్తారు.. ఇష్టం లేని వారు చూడరు.
ఇక నేను తీయబోయే తదుపరి వెబ్‌సిరీస్‌ని చూస్తే 'కడప' వెబ్‌సిరీస్ ఓ కుటుంబకథలా ఉంటుందని వర్మ మరో బాంబు పేల్చాడు. 'కడప'నే ఇలా తీస్తే, ఇక తదుపరి వెబ్‌సిరీస్‌ని ఆయన ఏ స్థాయిలో తీస్తాడో అర్ధమైపోతోంది. ఇక కడప ప్రాంతాన్నో, ప్రత్యేకంగా కొందరి వ్యక్తులనో, ఒక వర్గాన్నో కించపరచడానికి నేను 'కడప' వెబ్‌సిరీస్ తీయడం లేదు. ఒకప్పుడు కడపలో జరిగిన ఓ కథను చెప్పేందుకు దర్శకునిగా దీనిని ఎంచుకున్నాను. నేను తీసే వెబ్‌సిరీస్‌ని తప్పుగా ఊహించుకోవద్దు. ఇదే నా విన్నపం.. అన్నాడు.
ఇక ఈ 'కడప' వెబ్‌సిరీస్ కోసం సిరాశ్రీ రాసిన పాట కూడా అంతే హింసాత్మకంగా ఉంది. మరీ ముఖ్యంగా 'కడప'ను తిరిగరాస్తే అది పడక అనే పద ప్రయోగం పట్ల చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వెబ్‌సిరీస్‌ల ద్వారా వర్మ మరెంతగా రెచ్చిపోయి.. వర్గ, ప్రాంతీయతల కుంపట్లను రాజేస్తాడేమోనని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.