ఇటీవల హాలీవుడ్ నుంచి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ వరకు ఎందరో నటీమణులు తమకు జరుగుతున్న, తమకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి నిజం చెబుతున్నారు. ఇక మలయాళ నటి కిడ్నాప్, అత్యాచార యత్నంలో ఏకంగా ఓ మలయాళస్టార్ హీరోనే జైలు పాలై చివరకు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక రాధికాఆప్టే, కంగనా రౌనత్ నుంచి 'దంగల్' పిల్ల వరకు ఇలా పలువురు ఓపెన్‌గా విషయాలను బయట పెట్టేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌కి చెందిన ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి తనని లైంగికంగా వేధించాడని, తనను లొంగదీసుకోవడానికి నానా ప్రయత్నాలు చేశాడని, షార్ట్ ఫిల్మ్ నటి ఒకరు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యోగి తనను లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
దాంతో పోలీసులు యోగిని పిలిచి పోలీస్ స్టేషన్‌లో దాదాపు ఒకటిన్నర గంట విచారణ జరిపారు. పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట కూడా యోగి ఆ యువతిని అసభ్యంగా మాట్లాడాడని సమాచారం. ఇది ఇలా ఉంటే న్యాయవిచారణ చేయడానికి ఎన్నో పద్దతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు లైంగిక వేధింపులు అనగానే అది నిజమై పోదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా కొన్నిసార్లు తప్పులు నటీమణుల వద్ద కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ కేసులో యోగిపై ఫిర్యాదు చేసిన నటి విషయంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి గంగిరెడ్డి యోగిని తన వద్దకు పిలిపించుకుని పోలీసుల ముందే బూట్లతో కొడుతూ, చెంపలు వాయిస్తూ చాలా క్రూరంగా ప్రవర్తించాడు.
కింది స్థాయి పోలీసులైతే దానిలో కాస్త అర్ధముంది. కేవలం ఫిర్యాదు వచ్చిన వెంటనే అతనే నేరస్తుడని భావించడానికి వీలులేదు. అతను కేవలం నిందితుడు మాత్రమే. న్యాయా న్యాయాల సంగతి న్యాయస్థానాలు చూసుకుంటాయి. ఇక యోగిని ఆ పోలీసు అధికారి కొడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విచారణకు కూడా ప్రజాస్వామ్యంలో ఓ పద్దతి ఉంటుంది. ఇదేమీ ఆటవిక సమాజం కాదు కదా... అనేది పోలీసుల విజ్ఞతపై ఆధారపడి ఉంది...!