సమాజంలో కులాభిమానం, మతాభిమానం, ప్రాంతీయ, భాషా అభిమానాల వంటివి ఏమైనా కావచ్చు. అవి పది మందికి ఉపయోగపడేలా ఉంటే మంచే జరుగుతుంది. కానీ అదే వికృతపోకడలు పోతే ఆ అభిమానమే మనలను నిట్టనిలువునా అధ:పాతాళానికి తొక్కేస్తుంది. ఇక ప్రాంతీయ, భాషాభిమానంలో తమిళ తంబీలు ఎప్పుడు ముందుంటారు. చెన్నైలో వరదలు వచ్చినప్పుడు విశాల్ తన వంతు సాయం చేయడమే కాకుండా తానే రంగంలోకి దిగి పునరావాస కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. ఇక ఎంజీఆర్, రాజబాబులకు తమిళనాడులో ఉన్న గొప్పపేరుకి కారణం వారు వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తమ సొంత ఇంట్లో వేలాది మందికి భోజనంతో పాటు అన్ని సదుపాయాలు కల్పించడమే కాదు.. వీధి వీధిలో తిరిగి వానల్లో ముద్దయిపోతూ పనిచేసే పోలీసులకు, రిక్షా పుల్లర్లుకు రెయిన్‌కోట్‌లు ఇచ్చేవారు.
ఇక జల్లికట్టు ఉద్యమం సందర్భంగా రాఘవలారెన్స్, విజయ్‌లు అక్కడ మారు వేషాలలో ప్రత్యక్షం కావడమే కాదు.. ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలు టాయిలెట్ సమస్యలను ఎదుర్కొంటుంటే తమ సొంత క్యారవాన్‌లనే గాక అద్దె క్యారవాన్‌లను కూడా మెరీనా బీచ్‌కి తరలించారు. ప్రకాష్‌రాజ్, విశాల్ వంటి వారు రైతుల సమస్యల విషయంలో స్పందించడమే కాదు.. రైతుల దీక్షలకు మద్దతుగా ఢిల్లీ వెళ్లి ఉద్యమంలో పాల్గొన్నారు.
ఇక ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా తమిళనాడులోని వేలాదిమంది మత్య్సకారులు మృత్యువాత పడ్డారు. ఆశ్రయం కోల్పోయారు. ముఖ్యంగా కన్యాకుమారిలోని జాలర్ల పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో సంగీత దర్శకుడు, హీరో, ఎ.ఆర్.రెహ్మాన్ మేనల్లుడు జివి.ప్రకాష్ వారికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం జివి ప్రకాష్ తెలుగు '100%లవ్'కి రీమేక్‌తోపాటు బాల దర్శకత్వంలో జ్యోతికతో కలిసి ఓ చిత్రం చేస్తున్నాడు. ఈయన ఆన్‌లైన్ ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు చేయూతనిచ్చేవారి కోసం ఆన్‌లైన్ ప్రచారం మొదలుపెట్టాడు. ఈ ఆన్‌లైన్ ప్రచార లింక్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ కార్యక్రమానికి అందరూ తమ వంతు సాయం చేయాలని, ఇప్పటికే సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తన శక్తికి తగ్గట్లు 15లక్షలు సేకరించి బాధితులకు ఇవ్వడమే తాను చేయగలిగిన సహాయంగా పెద్ద మనసుతో ప్రకటించాడు. హ్యాట్సాఫ్ టు జివి. ప్రకాష్.