తాజాగా శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కి ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇచ్చిన భారీ విందు ఎక్కడలేని ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు ఎప్పుడు కలిసినా కూడా అందరి అటెన్షన్ ఈ ఇద్దరి మీదనే నిలుస్తుంది. ఇక ఈ విందులో కూడా అందరి చూపు కేసీఆర్, బాబులపైనే కాదు జనసేనాధిపతి పవన్‌పై కూడా నిలిచింది. నిజం చెప్పాలంటే ఈ విందుకు పవన్‌తో పాటు చిరంజీవి కూడా వచ్చినా కూడా గవర్నర్ నరసింహన్ ఎక్కువగా పవన్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు. పవన్‌కి ఇచ్చినంత గౌరవం చిరంజీవికి ఇవ్వలేదన్నది వాస్తవం. అసలు ఏ పదవి లేని పవన్‌ని ఈ విందుకు ఏ హోదాలో పిలిచారు? అనేది కూడా పలు సందేహాలకు తావిస్తోంది.
ఎంతైనా పవన్ ఏపీలో అధికారంలో ఉన్న టిడిపికి మిత్రపక్షం వంటివాడని తెలిసి ఈ గౌరవం ఇచ్చారా? లేక తెలుగు ప్రజలు, మరీ ముఖ్యంగా సినీ గ్లామర్, ఇమేజ్ ఎక్కువగా ఉండటం వల్ల గవర్నర్ పవన్‌కి అంత ప్రాధాన్యం ఇచ్చాడా? కాంగ్రెస్ హయాంలో గవర్నర్‌గా వచ్చినా కూడా మోదీ హయాంలో కూడా ఆయనను మచ్చిక చేసుకుని గవర్నర్ హోదాలో ఉన్న నరసింహన్ రాబోయే కాలంలో ఏపీలో బలమైన శక్తిగా పవన్ అవతరిస్తాడనే ముందస్తు వ్యూహంతో వ్యవహరించారా? గత ఎన్నికల్లో మోదీకి, చంద్రబాబుకి మద్దతు ఇచ్చినందుకు ఈ ఇద్దరు నాయకులకు ఇవాల్సిన అటెన్షన్‌ని పవన్‌కి ఇచ్చాడా? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక పవన్ సాధారణంగా ఏ వేడుకలకు పెద్దగా రాడు కాబట్టి ఆయన వైపు కాస్త అలర్ట్ చూపించాడా? అనేది కూడా ఓ పాయింటే. ఇక ఇలాంటి వేడుకల్లో చిరంజీవి, పవన్ ఇద్దరు కలుసుకోవడం చాలా అరుదు. కాగా వీరిద్దరు కలసి విందు చేయడం, చిరు మొదట కేసీఆర్‌తో ముచ్చటించి, తర్వాత చంద్రబాబుతో ముచ్చటిస్తున్న సమయంలో కేసీఆర్ కూడా వారితో కలవడం మరింత ఆసక్తిని రేపే విషయమే.