రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ పూర్తి కావొచ్చింది. మరికొన్ని రోజుల్లో టాకీ పార్ట్ పూర్తి చేసుకోనుంది. ఆ వెంటనే పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకోనుంది. ఇక సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు సుకుమార్ బిజిగా మారినా రామ్ చరణ్ మాత్రం బోయపాటి సినిమాకి షిఫ్ట్ అవుతాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ సినిమాతో రామ్ చరణ్ అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి.
అయితే ఇప్పుడు బోయపాటి - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కబోయే సినిమా మీద ఒక ఆసక్తికర విషయం వెలుగులోకొచ్చింది. అదేమిటంటే... వీరికలయికలో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ 80% వరకు రాజస్థాన్ లోనే జరగనుందట. రాజస్థాన్ ఎడారిల్లో రాజమహల్స్ లో ఆ 80% షూటింగ్ పూర్తి చేసి.. ఆ తరువాత మిగతా షూటింగ్ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో చేయనున్నారట. అయితే అసలు రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ అంటే.. దాదాపు అన్నీ యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాలో ఉన్నాయా అనే సందేహం వస్తోంది.
మరి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు అంటే మనకు వెంటనే... అల్లు అర్జున్ - బోయపాటి కలయికలో వచ్చిన సరైనోడు సినిమా గుర్తొస్తుంది. అంటే చరణ్ - బోయపాటి సినిమా కూడా సరైనోడు సినిమా తరహాలో ఉండబోతుందా? అనే అనుమానం వచ్చిన వెంటనే బోయపాటి సరైనోడు సీక్వెల్ తీస్తున్నాడా అనిపిస్తుంది. మరి అంత యాక్షన్ సన్నివేశాలుంటే చరణ్ ఎలా ఒప్పుకుంటాడో అనేది ప్రస్తుతానికి పెద్ద సందేహమే. చూద్దాం ఏం జరుగుతుందో.