దేశంలో పలువురు లెజండరీ నటీనటులు ఉన్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్, ఏయన్నార్, రాజ్‌కుమార్, ఎమ్జీఆర్, శివాజీగణేషన్, అమితాబ్, చిరంజీవి, రజనీకాంత్, కమల్ వంటి వారు ఉన్నారు. వారికి కేవలం సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. సినీ సెలబ్రిటీలలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. అలాంటి హీరోల చిత్రాలలో నటించే అవకాశం వస్తే ఎంతటి సొంత ఇమేజ్ ఉన్నా కూడా వారి చిత్రాలలో నటించడం అదృష్టంగా భావించి, చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా సరే నో చెప్పకుండా చేస్తారు. అది లెజెండ్లకు మనమిచ్చే గౌరవం.
అమితాబ్ చిత్రంలో చేయమంటే షారుఖ్ నుంచి సల్మాన్ వరకు ఓకే అంటారు. రజనీతో నటించమంటే షారుఖ్ నుంచి అమితాబ్ కూడా ఓకే అంటారు. అది నిజమైన అభిమానం. ఇక విషయానికి వస్తే కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఆయన స్ఫూర్తితోనే సినిమా రంగంలోకి వచ్చి ఎదిగాడు. ఇక ఆయనలాగే స్టెప్స్, డ్యాన్స్‌లు వేయాలని కష్టపడి అలాంటి మూమెంట్స్ చేసేవాడు. ఇక సునీల్ సినిమాలలో ఎలా సున్నితంగా నవ్విస్తాడో బయట కూడా అంతే సున్నితంగా ఉంటాడు. గతంలో కూడా అయన అనేకసార్లు చిరంజీవిపై తనకున్న ఇష్టాన్ని తెలిపాడు.
ఇక తాజాగా ఆయన శంకర్‌తో కలిసి '2 కంట్రీస్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో కూడా సునీల్ చిరంజీవి ప్రస్తావన తెచ్చాడు. నాకు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. హిట్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మొదట నేను వెళ్లేది ఆయన దగ్గరకే. హిట్ వస్తే బాగా ప్రోత్సహిస్తాడు. ఆ హిట్స్లని ఎలా నిలబెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతాడు. ఫ్లాప్ వచ్చినా కూడా సునీల్ బాధపడకు. సినిమా ఫ్లాప్ అయిందే గానీ నటునిగా నీవు ఫెయిల్ కాలేదని ఆత్మ స్తైర్యం నింపుతూ, ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు. ఈరోజున నేను ఇలా ఉన్నానంటే కారణం చిరంజీవినే అని చెప్పాడు..
ఇక చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇస్తూ తన 150వ చిత్రంగా 'ఖైదీనెంబర్ 150' చిత్రం చేశాడు. ఈ చిత్రంలో చిరంజీవి పక్కన ఓ హాస్యనటుడి పాత్రను సునీల్‌ని చేయమని చెప్పినా కూడా హీరో మోజులో పడి, తన స్థాయి తక్కువైపోతుందని భావించి దానికి నో చెప్పాడు. వాస్తవానికి చిరంజీవి 150వ ప్రతిష్టాత్మక చిత్రంలో చేయాలని, కనీసం ఆయనతో కలసి ఒక్క షాట్‌లోనైనా కనిపించాలని ఎందరో ఆశపడ్డారు. కానీ ఆ అవకాశం సునీల్‌కి వచ్చినా గౌరవంగా ఆ పాత్రను చేసి ఉంటే ఆయనకు అభిమానిని అని చెప్పుకునే మాటలు నిజమేనని భావించేవారు.
కానీ సునీల్ ఆ చాన్స్‌ను వదులుకుని ఇక హీరోగా సక్సెస్ కాలేనని తెలుసుకుని ఇప్పుడు పెద్ద స్టార్స్ చిత్రాలలో కామెడీ పాత్రలు చేయడానికైనా ఓకే చెప్పి 'సై..రా'లో నటిస్తున్నాడు. ఇక పవన్ -త్రివిక్రమ్‌ల 'అజ్ఞాతవాసి'లో కూడా నటించడానికి నో చెప్పి, తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రానికి మాత్రం ఓకే చెప్పాడు. ఇలా ఈయన మాటలకు చేతలకి అసలు సంబంధమే లేదని బాగానే అర్ధమవుతోంది.