ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారు హీరోలుగా ఉన్నప్పుడు వారి చిత్రాలలో బాలనటీమణులుగా నటించిన శ్రీదేవి, జయంతి వంటి వారు ఉండేవారు. నాడు శ్రీదేవి, జయంతి వంటి వారు చిన్నగా ఉన్నప్పుడు ఆయా హీరోలు వారిని ఎత్తుకుని, ఒడిలో కూర్చొబెట్టుకున్నవారే. కానీ వారు పెద్దయి హీరోయిన్లు అయిన తర్వాత కూడా అదే హీరోల సరసన జతకట్టారు. ఇక మీనా, రాశి వంటి బాలనటీమణులు కూడా చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్‌స్టార్స్ చిత్రాలలో బాలనటీమణులుగా నటించి, ఆ తర్వాత ఆయా స్టార్స్‌తోనే జోడీ కట్టి హిట్‌పెయిర్స్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇలా హీరోలు ఆరవై ఏళ్ల వయసులో కూడా కుర్రహీరోలుగానే స్టెప్పులు డ్యూయెట్స్ పాడుతూ, తమ మనవరాలి వయసు ఉన్న వారితో రొమాన్స్ చేస్తూ ఉండటం తరచుగా జరిగేదే.
అమీర్‌ఖాన్‌కి 'దంగల్' చిత్రంలో కూతురిగా నటించిన నటే ఇప్పుడు అమీర్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఇలాంటి ఘటననే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సునీల్ మలయాళ రీమేక్ '2 కంట్రీస్' చిత్రంలో హీరోగా నటించాడు. 29వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంపై సునీల్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఎంతో కాలంగా హీరోగా హిట్ లేని ఆయనకు, దర్శకుడు శంకర్‌కి కూడా ఇది కీలకంగా మారింది. ఇక ఈచిత్రంలో సునీల్ సరసన మనీషారాజ్ అనే అమ్మాయి నటిస్తోంది. ఈ చిత్రం లోకేషన్స్ ఎంపిక కోసం ఈ చిత్రం దర్శకుడు, నిర్మాత, సినిమాటోగ్రాఫర్లు యూఎస్ వెళ్లి ఓ ఇంట్లో దిగారు. అక్కడ ఉన్న ఆ అమ్మాయికి ఈ చిత్రంలో హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉండటంతో ఆమె తల్లిదండ్రులను హీరోయిన్‌గా చేయడానికి ఒప్పించారు. ఈ ఒక్క చిత్రంలో అయితే ఓకే అని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
ఇక ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ హీరోయిన్ తండ్రి సునీల్‌కి ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడట. 'సొంతం' చిత్రం కోసం అందులో కమెడియన్ బ్యాచ్‌లో ఒకడైన సునీల్ కూడా న్యూజిలాండ్ వెళ్లి అటునుంచి సింగపూర్ వెళ్లాడట. అప్పుడు ఓ యంగ్ కపుల్ వచ్చి తమ చిన్నారి పాపతో కలిసి సునీల్‌తో ఫొటో దిగారు. ఈ ఫొటో కోసం సునీల్ ఆ పాపని ఎత్తుకుని ఫోజిచ్చాడు. అదే పాపే ప్రస్తుతం సునీల్ సరసన '2 కంట్రీస్'లో నటిస్తున్న పాప అని ఆమె తండ్రి చెప్పడంతో సునీల్ షాకయ్యాడట. నిజంగా ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుండటంతో ఈ విషయం బాగా వైరల్ అయింది.