దేశంలో ప్రతి విషయాన్ని వాక్‌స్వాతంత్య్రం పేరుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, మంచి పనులపై కూడా విమర్శలు చేస్తూ తామేదో గొప్ప మేధావులుగా కనపడాలనే ధోరణి బాగా కనిపిస్తోంది. మంచిని మంచి అని, చెడుని చెడు అని నిజాయితీగా ఒప్పుకునే వారు లేరు. ప్రతి ఒక్కరు కోడిగుడ్డుకు ఈకలు పీకడం.., మోకాలికి, బోడిగుండుకు సంబంధం పెడుతూ పెడసర ధోరణిలో మాట్లాడేవారే ఎక్కువయ్యాయి. మీడియా కూడా కాంట్రవర్శీలు, తద్వారా టీఆర్పీల కోసం వాటినే హైలైట్ చేస్తున్నాయి. ఇక విషయానికి వస్తే జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు న్యూఇయర్‌గా జరుపుకుంటారు. ఇక మనదేశంలో కూడా అదే ఆనవాయితీ వస్తోంది. నిజానికి ఆదివారం సెలవు దినం చేయడం వెనుక కూడా బ్రిటిష్ వారు అనుసరించే పద్దతే కనిపిస్తోంది. కానీ ముస్లిం దేశాలలో, పాకిస్థాన్ అరబ్ దేశాల వరకు ఆయా ప్రభుత్వాలు ఆదివారం సెలవుని ఇవ్వకుండా తమకు పవిత్రంగా భావించే శుక్రవారం నాడే సెలవు దినాలను ప్రకటిస్తారు.
కానీ మనం మాత్రం బ్రిటిష్ బానిసత్వపు బతుకులు, మనోభావాల నుంచి బయట పడలేక ఇప్పటికీ అదే భావ దారిద్య్రంలో ఉన్నాం. ఇక మన తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాదిని మనం పట్టించుకోం గానీ జనవరి 1న మనం చేసే హంగామా మామూలుగా ఉండదు. దీనిపై చిలుకూరు బాలాజీ స్వామి దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ చేసిన వ్యాఖ్యలు తాజాగా సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం కూడా ఇంగ్లీషు సంవత్సరాదిన దేవాలయాలలో ప్రత్యేక పూజల వంటి వేడుకలను రద్దు చేసింది. ఇక తనకు జనవరి 1వ తేదీన ఎవరైనా హ్యాపీ న్యూఇయర్ అని చెబితే తాను గుడిలోనే వారిచేత గుంజీలు తీయిస్తానని రంగరాజన్ అన్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ, జనవరి 1న కొత్త సంవత్సరం జరుపుకోవడం మన సంప్రదాయం కాదు. తప్పు చేసిన వాడు దేవుని సన్నిధిలో శిక్ష అనుభవిస్తే తప్పేంటి..? మన సంప్రదాయం కాని వాటిని మనం ఎందుకు జరుపుకోవాలి? ఓ పిల్లాడిని కొత్త సంవత్సరం ఎప్పుడు అని అడిగితే జనవరి 1 అని చెప్పాడు. అందులో ఆ బాబు తప్పేమి లేదు. ఎందుకంటే ఆ బాబుకి పెద్దలు ఎవ్వరూ ఉగాది గురించి చెప్పలేదు. ఇక దేవుని సన్నిధిలో ఓ ప్రొఫెసర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటే ఆయన చేత కూడా దేవుని ఎదుట గుంజీలు తీయించాను. హ్యాపీ న్యూఇయర్ పంతులు అని ఎవరు అన్నా గుడిలో గుంజాలు తీయిస్తానని చెప్పాడు. ఈ డిబేట్‌లో పాల్గొన్న కత్తిమహేష్‌ని ఉద్దేశించి కూడా ఆయన కత్తి మహేష్ అయినా గుడిలో అదే తప్పు చేస్తే అదే శిక్ష వేస్తాను. ఇక బయట వారు ఎలా? ఎందుకు? న్యూఇయర్‌ని జరుపుకుంటారో అది వారి ఇష్టం. అది వారి విజ్ఞతకే వదిలేస్తాను. కానీ గుడిలో తప్పు చేస్తే మాత్రం దేవుని ముందు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పాడు. మొత్తానికి రంగరాజన్ వాదనలో సరైన పాయింట్ ఉందనే చెప్పాలి.