నేడు నవగ్రహం చానెల్ దశమగ్రహంగా మారి సమాజానికి తీవ్రమైన చెడును చేస్తోంది. మూఢనమ్మకాలను పారదోలుదాం.. మెరుగైన సమాజం కోసం.. కులం అడిగిన వాడిని చెప్పుతో కొట్టండి... వుయ్ రిపోర్ట్.. యూ డిసైడ్.. మా అక్షరం మీ ఆయుధం అని చెప్పే పత్రికలు, చానెల్స్ టీఆర్పీల కోసం వెంపర్లాడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. ఇక మీడియా మొఘల్‌కి చెందిన చానెల్స్‌లోనే బూతులతో కామెడీ 'జబర్ధస్త్'లు 'పటాస్'లు, నాడు తీవ్రంగా వార ఫలాలను వ్యతిరేకించి, ఇప్పుడు వాటినే హైలైట్‌గా ప్రచురిస్తూ, సీరియల్స్‌లో కూడా మహిళలను క్రూరమైన విలన్లుగా చూపించే వారు సైతం ఇప్పుడు ఎక్కడ వివాదం సృష్టించి, దేనిని డిబేట్‌కి పెట్టి టీఆర్పీలు పెంచుకుందామా? అని చొంగకారుస్తున్నారు.
ఇక తాజాగా ఓచానల్ నిర్వహించిన డిబేట్‌లో ఏదో పొట్ట కూటి కోసం రంగులు మారుస్తూ, ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నవేణు స్వామి వచ్చాడు. వచ్చి పవన్ గురించి డిబేట్‌ని పెట్టాడు. పవన్‌కి రాజభోగమే గానీ రాజయోగం లేదని, పవన్ హిందుపురం నుంచి పోటీ చేస్తే బాలకృష్ణ చేతిలో తీవ్రంగా ఓడిపోతాడని తన మంత్ర, తంత్ర, జ్యోతిష్య వాగ్దాటితో ఆ చానెల్‌ని న్యాయం చేయబోయాడు. కానీ అంతలో జనవిజ్ఞానవేదిక నాయకులు పి.వి.రావు ఎంటర్ అయ్యాడు. 2017 ఆగష్టు నాటికి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు వస్తారని గతంలో చెప్పారని, నరసింహన్ గవర్నర్ పదవి కోల్పోతాడని చెప్పిన మాటలు ఏమైనా నిజమయ్యాయా? గతంలో వెంకయ్యనాయుడు సీఎం అవతారని చెప్పారు? అది ఏమైంది? ఇక కట్టుకధలతో జనాలను మోసం చేయవద్దు అని ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.
దాంతో ఈ చానెల్ తనని పవన్ విషయం మాట్లాడమని చెప్పిందని, ఆ పాయింట్‌ని డైవర్ట్ చేస్తున్నారని వేణుస్వామి పాపం నీళ్లు నమిలాడు. ఇక రంగంలోకి వేణుమాధవ్ ఎంటర్ అయ్యాడు. తన జన్మదినం, జాతక చక్రం చూసి తన గురించి చెప్పాలని కోరాడు. దానికి ఆయన 2012 నుంచి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి. లివర్ సంబంధిత వ్యాదులు వస్తాయి. 2020 వరకు ఎమ్మెల్యే అయ్యే చాన్స్‌లేదని సెలవిచ్చాడు. దాంతో హాస్పిటల్‌కి వెళ్లి పరీక్షలు చేయిద్దాం. నాకేం రోగమో అప్పుడే తేలుతుంది. గడ్డాలకు, మీసాలకు రంగులేసుకుని జనాలను తప్పుదోవ పట్టించవద్దని అందరూ కౌంటర్స్ స్టార్ట్ చేయడంతో పాపం.. వేణుస్వామి ఏమీ చేయలేక తనను అవమానిస్తున్నారని జంప్ అయిపోయాడు. ఇందులో వేణుస్వామి తప్పు కన్నా, ఇలాంటి డిబేట్‌ని నిర్వహించి టీఆర్పీలు కొల్లగొట్టాలని చూసిన చానెల్‌దే తప్పు అని చెప్పాలి.