2017కి వీడ్కోలు పలుకుతూ, 2018 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ, నూతన సంవత్సరం ప్రారంభ క్షణాలను ఆనందంగా, ఆస్వాదిస్తూ గడిపేవారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉంటారు. కానీ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల పిల్లలు, బడా రాజకీయ నాయకులు, వారి కుమారులు కూడా మద్యం తాగి వాహనాలను నడుపుతూ యాక్సిడెంట్ల పాలై దుర్మరణం చెందారు. బాబూమోహన్, కోటశ్రీనివాసరావు, మంత్రి నారాయణ సంస్థల అధినేత నారాయణ కుమారుడు.. ఇలా బలైపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇక నిద్రమాత్రలు, యాంటి డిప్రెషన్ మందులు వేసుకుని తన తల్లి మరణం తర్వాత రాజశేఖర్ యాక్సిడెంట్ చేయడం, నాటి ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ మద్యం తాగి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడం, ఆయన సోదరుడు కూడా కారు దుర్ఘటనలో మరణించడం, రవితేజ సోదరుడు... రోజూ ఎందరో సినీ ప్రముఖులు, వారి పిల్లలు, బడా వ్యక్తుల సంతానాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లలో పట్టుబడుతున్నారు.
తాము ప్రమాదాలకు గురి కావడమే కాదు.. ఇతరుల ప్రాణాలతో కూడా వీరు చెలగాటం ఆడుతున్నారు. కనీసం సెలబ్రిటీలైనా తాము మద్యం సేవించినప్పుడు తోడుగా ఎవరినైనా డ్రైవింగ్ చేయడానికి తీసుకొని పోకుండా, తామే వాహనాలు నడుపుతూ బుక్కవుతున్నారు. కానీ ఎంత వీరు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి మీడియాకి ఎక్కుతూ విమర్శలు పాలవ్వడమే కాదు.. పరువు పోగొట్టుకుంటున్నా కూడా మార్పు రావడం లేదు.
ఇక హైదరాబాద్‌లో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారుఝాము వరకు ఏకంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1200 కేసులు నమోదయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పోలీసులు కూడా ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా ఏకంగా ఐదు వేలమంది పోలీసులతో భారీ డ్రంక్ డ్రైవ్‌ని చేశారు. ఇలా పట్టుబడిన వారిలో యాంకర్ ప్లస్ నటుడు ప్రదీప్ కూడా ఉన్నాడు. వీరికి రేపు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. బాగా ఎక్కువ మద్యం సేవించిన ప్రదీప్‌కి ఇందులో కాస్త కఠిన శిక్ష పడే అవకాశాలే ఉన్నాయని పోలీసులు అంటున్నారు.