రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తానని తేల్చేశాడు. ఆ విషయంలో అయితే క్లారిటీ వచ్చింది గానీ ఆయన విధి విధానాలు, ఆయన పార్టీ సిద్దాంతాలు, ఎన్నికల గుర్తు వంటి వాటికి ఇంకా సమయం ఉంది. ఇక రజనీ ఖచ్చితంగా గెలుస్తాడని, సీఎం అవుతాడని కొందరు అంటుంటే... అది ఇంత ఈజీకాదని అమితాబ్, చిరంజీవిల ఉదంతాలను కొందరు చూపుతున్నారు. మరోవైపు రజనీ మెతక మనిషి, సినిమాలలో ఎలా కనిపించినా ఆయన నిజజీవితంలో వివాదరహితుడే గాక ఎవ్వరినీ నొప్పించని మనస్తత్వం. కానీ నేటి యువత దూకుడు రాజకీయాలను ఇష్టపడుతోంది. ఈ విషయంలో రజనీ కంటే కమల్‌కే దూకుడు ఎక్కువ. మరోవైపు రజనీ ప్రస్తుత వయసు 67 ఏళ్లు. ఆయన గత దశాబ్దకాలంపైగా రెండు మూడు సార్లు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి ఆయన వయసు 70కి చేరువవుతుంది. మరి ఆ వయసులో ఆయన ఎండనక, వాననక ప్రచారం చేయగలడా?
ఇక రజనీ తమిళుడు కాదు కాబట్టి కొందరు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. పైగా చదువు, ఇతర విషయాలలో ఆయన పరిజ్ఞానం ఎంతో ఎవ్వరికీ తెలియదు. కారణం ఆయన ఇప్పటివరకు అలాంటి ప్రసంగాలు చేయలేదు. ఇక రజనీ తన పార్టీ గుర్తుగా తామరపువ్వు, మద్యలో బాబా సంకేతం ఉంటుందని ప్రచారం మొదలైంది. దీంతో ఆయనకు అనధికారికంగా బిజెపి పెద్దలతో పరోక్ష సంబంధాలు ఉన్నాయని కొందరు అనుమానిస్తున్నారు. తమిళనాడు ప్రజలు ప్రస్తుతం బిజెపి అంటే మండిపడుతున్నారు. ఈ విషయం ఆర్కే నగర్ ఉప ఎన్నికలలోనే తేటతెల్లమైంది. ఇక రజనీ తాజా గుర్తుగా పామును చెబుతున్నారు. మరి పాము దేనికి సంకేతం అనే విషయంలో క్లారిటీ లేదు.
మరోవైపు తమిళనాడులో ఆస్తికవాదులు ఎందరు ఉన్నారో..నాస్తిక వాదులు కూడా దాదాపు అంతే సమానంగా ఉన్నారు. డిఎంకేతో పాటు అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా కంచి కామకోటి పీఠాధిపతి నుంచి రామసేతు వరకు ఎన్నింటినో వారు వ్యతిరేకించారు. స్వామీజీలను, రామసేతుని కూడా కొట్టిపారేశారు. మరోవైపు రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలు అంటున్నాడు. దీనిపై ఆయన స్పష్టంగా చెప్పకపోవడంతో ఆధ్యాత్మికం అంటే హిందు వాదమే అని కొందరు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. కానీ రజనీ మాత్రం మతాలకు సంబంధం లేని ఆద్యాత్మికత అని స్పష్టం చేయాల్సివుంది. ఇక రజనీ మలేషియా వెళ్లనున్నాడు. అక్కడ ఆయన కమల్‌తో 6వ తేదీని భేటీ కానున్నట్లు సమాచారం.