తమిళనాట రాజకీయాలు రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. తమిళనాట ఎలాగూ జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లకు స్థానం లేదు. ఇక రజనీకాంత్ కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే తమిళనాడులో రజనీకాంత్ పార్టీ-కమల్‌హాసన్ పార్టీ-డీఎంకే- అన్నాడీఎంకేలోని పన్నీరుసెల్వం, పళనిస్వామి, శశికళ గ్రూపుల మద్య పోటీ ఉండనుంది. ఇక విజయ్‌కాంత్ నుంచి పీఎంకే రామదాసు వంటి వారికి కూడా అక్కడ ఆదరణ ఉంది. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికలతోపాటే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయా? లేదా? అనేది కేంద్రం చేతిలో ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 234 స్థానాలన్నింటిలో పోటీ చేస్తామని రజనీ చెప్పాడు. ఇక కమల్ హాసన్ విషయం తేలాల్సివుంది. మిగిలిన పార్టీలతో పాటు రజనీ, కమల్‌లు కూడా ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా? అనే దిశగా రాజకీయ చర్చలు సాగుతున్నాయి.
నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా, నిర్మాతల మండలి అధ్యక్షునిగా తెలుగు వాడైన విశాల్‌రెడ్డికి అక్కడ మంచి ఆదరణే ఉంది. మాస్ సినిమాలతో పాటు రైతులకు, వరదలు వంటివి వచ్చినప్పుడు ఆయన వేగంగా స్పందించే విధానం అందరి మెప్పునుపొందింది. ఇక కమల్‌హాసన్, రజనీల మద్య తమిళ సినీ నటులు చీలిపోతారని పలువురు భావించారు. కానీ కమల్ ఎంట్రీ తర్వాత ఆయనకు సినీ ప్రముఖులెవ్వరూ పెద్దగా మద్దతు ఇవ్వలేదు. కానీ రజనీకి మాత్రం అమితాబ్, రాఘవలారెన్స్, మహారాజలింగంతో పాటు అక్షయ్‌కుమార్ కూడా మద్దతు ప్రకటించాడు.
ఇక విశాల్ కూడా తాజాగా రజనీకి తన సపోర్ట్ ఉంటుందని తెలిపి, ఆయన వెంటే నడుస్తానని, మొత్తం 234 స్థానాలలో ప్రచారం చేస్తానని చెప్పడం కీలక పరిణామం. విశాల్‌ని చూసి ఓట్లు పడతాయా? లేదా? అనేది పక్కనపెడితే విశాల్ మద్దతు తెలపడం అనేది చాలా ముఖ్యం, నటీనటులు, నిర్మాతల సంఘాలకు ఎన్నికైన విశాల్ రజనీకి మద్దతు తెలపడంతో ఆయన సన్నిహితులు కూడా రజనీకి మద్దతు పలికే అవకాశం ఉంది. మరోవైపు విశాల్ కూడా ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వేశాడు. కానీ అది తిరస్కరణకు గురైంది.
దాంతో ఆయన ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగువారు ఎక్కువ ఉన్న ఆర్కేనగర్ ఎన్నికల్లో దినకరన్‌కి మద్దతు పలికాడు. దాని ద్వారా దినకరన్‌కి బాగానే లబ్ది చేకూరి, విశాల్ ఆయన గెలుపులో కీలకమయ్యాడని కూడా అంటున్నారు. మరోవైపు దినకరన్ కేవలం డబ్బులు పంచడంతోనే గెలిచాడని కమల్‌హాసన్ తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. దినకరన్ మాత్రం కమల్ తన విజయాన్ని చూసి తట్టుకోలేకే ఇలా ప్రచారం చేస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి విశాల్ మాత్రం దినకరన్ నుంచి రజనీ వైపుకి రావడం మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.