చివరకు ఉప్పునిప్పుగా ఉన్న నందమూరి హీరోలు ఒకటవుతున్నారు. ఇక మారాల్సిన బాధ్యత అభిమానులదే. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలిసి రాజమౌళితో మల్టీస్టారర్ చేయనున్నారు. రామ్‌చరణ్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో తారకరత్న విలన్‌గా నటించనున్నాడు. ఇప్పుడు పవన్ వంతు కూడా వచ్చింది. పవన్ -త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'అజ్ఞాతవాసి' 9వ తేదీ నుంచే రచ్చ చేయడానికి వస్తోంది. సో.. దీనిని ఎవరు బాగా క్యాష్ చేసుకుంటారా? అని వెయిట్ చేస్తున్న సమయంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నేనంటూ ముందుకొస్తున్నాడు.
ఆయన ఎంతో కాలంగా కేవలం తన సొంత చిత్రాలలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. రాకరాక ఈయనకు 'ఎమ్మేల్యే' అనే చిత్రం ద్వారా బయటి నిర్మాతలు దొరికారు. కానీ దీనికి కూడా వెనుక నుంచి పెట్టుబడి పెడుతోంది కళ్యాణ్‌రామే అంటున్నారు. మరి ఈ విషయంలో క్లారిటీ లేదు గానీ నందమూరి కళ్యాణ్‌రామ్ ఇప్పుడు 'ఎంఎల్‌ఏ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల హవా నడుస్తుండటంతో దీని బ్యాగ్రౌండ్ కూడా పొలిటికల్ థీమేనని సమాచారం. మరోవైపు 'ఎంసీఏ'కి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' అన్నట్లుగా 'ఎమ్మెల్యే'కి 'మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి'అని పెట్టారు. ఇందులో చందమామ కాజల్ తన మొదటి చిత్రం 'లక్ష్మీకళ్యాణం' హీరో కళ్యాణ్‌రామ్‌తో జోడీ కడుతోంది.
ఇటీవలే ఆమె తన మొదటి చిత్రం దర్శకుడు తేజకి 'నేనే రాజు నేనే మంత్రి'తో బ్రేక్ ఇచ్చింది. ఆ విధంగా చూసుకుంటే కాజల్ తన మొదటి దర్శకుడిలాగానే, తన మొదటి హీరోకి కూడా హిట్ ఇచ్చి ట్రాక్‌లోకి తెస్తుందా? అనేది చూడాలి. ఇక ఉపేంద్రమాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, విశ్వప్రసాద్ -భరత్ చౌదరిలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని 'అజ్ఞాతవాసి' చిత్రం ఇంటర్వెల్‌లో ప్రదర్శించేలా హారిక అండ్ హాసిని బేనర్‌తో వారు టైఅప్ అయ్యారట. అదే జరిగితే 'అజ్ఞాతవాసి' పుణ్యాన 'ఎమ్మెల్యే'కూడా ఎందరికో రీచ్ అవుతుంది. మరో వైపు రెండు రోజుల తేడాలో బాబాయ్ 'జైసింహా'గా వస్తుంటే కళ్యాణ్‌రామ్ మాత్రం 'జై సింహా'ని వదిలేసి 'అజ్ఞాతవాసి'పై పడ్డాడంటే విషయం అందరికీ సులభంగానే అర్ధమవుతుంది.