మెరుగైన సమాజం కోసమని ఒకరు... మా అక్షరం... మీ ఆయుధమని మరికొందరు... ఇలా మిగిలిన రాష్ట్రాల సంగతేమో గానీ తెలుగు రాష్ట్రాలలో మీడియా భ్రష్టు పట్టిపోయిందనేది సామాన్యుని నోటి నుంచే వచ్చే మాట. ఒకప్పుడు పత్రికలన్నా, మీడియా అన్నా ఓ గౌరవం ఉండేది. నేడు భయం తప్ప గౌరవం లేదు. నాడు అందులో వచ్చే వార్తల పట్ల విశ్వసనీయత ఉండేది. కానీ నేడు అది కనిపించడం లేదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల నుంచి అన్నింటిది ఇదే కోవ. ఈనాడు పత్రికను విలువలకోసం స్థాపించామంటారు. కానీ రామోజీరావు హయాం కాస్త తగ్గిన తర్వాత ఆయన కుమారుల హయాంలో ఈ పత్రిక, ఛానెల్స్ పరిస్థితి ఏమిటో అర్ధమవుతుంది. నాడు వారఫలాలు మూఢనమ్మకం అన్నారు. నేడు వాటినే ప్రచురిస్తున్నారు. మరోవైపు తాము యాంటీ కాంగ్రెస్ అని రామోజీరావు బహిరంగంగానే చెప్పాడు. 'జబర్దస్త్, పటాస్'లతో దిగజారుతున్నారు. జగన్ వచ్చి భేటీ అయిన తర్వాత ఆ ఛానెల్, పత్రికల వైఖరి మారింది.
ఇక ఎబిఎన్-ఆంధ్రజ్యోతిలు టిడిపికి, కమ్మ కులానికి బాకాలుగా మారాయి. సాక్షి పత్రికకు ఏది న్యూసో.. ఏది కాదో కూడా తెలియని పరిస్థితి. కేవలం వైసీపీ కరపత్రిక, జగన్ కోసమే, జగనే ఊపిరిగా నడుస్తోంది. ఇక వామపక్షాలకు చెందిన ప్రజాశక్తి, విశాలాంద్రలది వారి పార్టీ బాకానే. వార్త నుంచి టివి 9 వరకు ఇదేగోల. టీఆర్పీల కోసం తాపత్రయం. వివాదాన్ని తామే సృష్టించి, దాని మీద తామే చర్చలు నిర్వహించే పరిస్థితి. దీనిలో ఎవరు తక్కువా కాదు.. ఎవ్వరూ ఎక్కువా కాదు. ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలు, డబ్బున్న వారు, వివిధ పార్టీలకు చెందిన బడాబాబులు మీడియాలోకి రావడంతోనే విలువలు పతనమయ్యాయి. చివరకి సుప్రీం కోర్టు తీర్పులని కూడా ఎవరికివారు తమకు అనుగుణంగా మార్చుకుంటూ ఉన్నారు. సంచలనాలు, బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేవారికి, యాడ్స్‌తెచ్చేవారికి మాత్రమే నేటి మీడియాలో చోటు.
మరో పచ్చి వాస్తవం ఏమిటంటే.. నేడున్న ఏ మీడియా కూడా జర్నలిస్ట్‌లకు సరిగా జీతాలు ఇవ్వరు. కానీ వారి మీడియాలో మాత్రం ఫలానా కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. అవి ఇవ్వడం లేదు.. ఇవి ఇవ్వడం లేదు అనే వార్తలే. దాంతో జర్నలిస్ట్‌లు కూడా పై సంపాదనకు అలవాటుపడ్డారు. దీనికి తోడు పీఆర్వోలు, ఇతరులకు కూడా మాటకారి తనం ఉంటేనే వారికే పెద్ద పీట, ఎవడు భజన చేస్తే వాడే గొప్ప జర్నలిస్ట్. మాది భజన కాదు... బాధ్యత అంటారు. మరి అదేమి బాధ్యతో ఎవ్వరికీ తెలియదు.
ఇక టీవీ9 పై తాజాగా హైపర్ ఆది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మరి ఆయన చేస్తున్న ఈటీవీలో 'జబర్దస్త్' కూడా టీఆర్పీల కోసమే కదా...! ఇలా మీడియా పూర్తిగా పక్కదారి పట్టింది. నేడు నిజమైన జర్నలిస్ట్‌లు ఎవ్వరూలేరు. ఉన్నా వారికి బతకడం తెలియదు. జీతాలు ఉండవు. దాంతో ఈ వృత్తినే వదిలేసి ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారు. నయా జర్నలిస్ట్‌లదే ఈ లోకం.. ఒక్కొక్కరిది ఒక జెండా.. ఒక్కో అజెండా.. నిజమైన జర్నలిస్ట్‌లకి ఇక్కడ చోటే లేదు. వారిని ప్రోత్సహిస్తున్న ప్రజలకు, యాజమాన్యాలకు, వారిని డబ్బులతో మభ్యపెడుతున్న అందరూ దీనికి బాధ్యులే...!పారా హుషార్.