తాను బతికున్నంతకాలం నిష్పాక్షికంగా, ఎవరి మధ్య ఏ గొడవలు వచ్చినా నేనున్నాంటూ దాసరి నారాయణరావు ముందుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించేవారు. ఆయనకు సినిమాలపైనే కాదు.. అభిమానుల మనస్తత్వం, మీడియా వైఖరి, జర్నలిస్ట్‌ల భావాలు అన్ని ఆయనకు తెలుసు. నేడు నిజంగా ఆయన బతికుంటే పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, కత్తి మహేష్‌కి జరుగుతున్న వివాదాన్ని ఇప్పటికే పరిష్కరించేవారు. ఇక దాసరి తర్వాత ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా తమ్మారెడ్డి భరద్వాజ, మోహన్‌బాబు వంటి వారు వ్యవహరిస్తారని అందరూ భావించారు. కానీ ఈ వివాదంలోనే కాదు... నంది అవార్డుల గొడవలో కూడా వీరు చురుకైన పాత్రను నిర్వహించలేకపోయారు.
ఇక దాసరి తర్వాత చిన్న సినిమాల వారు. ఇండస్ట్రీ ప్రముఖులు ప్రతి ఒక్కరు చిరంజీవిని ఆశ్రయిస్తున్నారు. ఆయన దీవెనలు తీసుకుంటూ, తమ చిత్రాల ప్రచారానికి, తమ సమస్యలను విన్నవించుకుంటూ వస్తుండటంతో ఇక ఈ విషయంలో చిరు పెద్ద మనిషి అవుతాడని కొందరు వ్యాఖ్యానించారు. కానీ చిరు కూడా ఈ వివాదాలలో మౌన పాత్రే వహించారు. తన సొంత తమ్ముడి వ్యవహారం కాబట్టి ఆయన ఏది చేసినా మంచి చేసినా కూడా విమర్శలు తప్పవని ఆయన భావించినట్లు ఉన్నాడు.
ఇక తాజాగా పృథ్వీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. తమ గురువు దాసరి ఉండి ఉంటే ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించేవారని, ఇప్పటికైనా సినీ పెద్దలు ముందుకొచ్చి కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్‌ని పిలిచి చర్చ సాగించాలని, వాటికి అన్ని మీడియాల నుంచి జర్నలిస్ట్‌లను కూడా పిలవాలని ఆయన కోరారు. ఇది సున్నితమైన విషయమని, ఏది మాట్లాడినా గొడవలు అవుతాయని, కాబట్టి ఈ విషయాన్ని ప్రజల నిర్ణయానికే వదిలేయాలని మంచి మాట చెప్పారు. ఇది అక్షరాల సత్యం. ఇక ఇక్కడ కేవలం పవన్ ఫ్యాన్స్, మెగాభిమానులనే కాదు.. ప్రతి హీరో అభిమానులను ఆయా హీరోలు కట్టడి చేయాల్సివుంది.
ఈ అత్యుత్సాహం కేవలం మెగాభిమానులలోనే కాదు.. ప్రతి హీరో అభిమానులలో ఉంది. ముఖ్యంగా కేవలం ఫ్యాన్స్ అని అందరినీ ఒకే గాటికి కట్టేయకుండా మరీ విపరీతపోకడలు పోయే వీరాభిమానులను మాత్రం కంట్రోల్‌లో పెట్టాల్సిన బాధ్యత అందరి హీరోలపై ఉంది. ప్రతి అభిమాని చేసే ఏ పని అయినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానే అది హీరోలకే చెందుతుంది. హీరోల స్ఫూర్తిగా అభిమానులు చేసే సామాజిక సేవలు ఎలా మంచి పేరును తెస్తాయో.. ఇలాంటి విషయాలలో అభిమానుల అత్యుత్సాహం కూడా ఆయా హీరోలకే ఆపాదించాల్సి వస్తుందనేది వాస్తవం.