తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఎవరు, ఎప్పుడు, ఎలా రాజకీయాలలోకి రావాలనే విషయంలో వారిదే తుది నిర్ణయం. ఇటీవల శరత్‌కుమార్ మాట్లాడుతూ, రజనీకాంత్ జయలలిత బతికున్నంత కాలం ఆయన రాజకీయాలలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. ఎవరైనా రాజకీయాలలో ఫలానా సమయంలో వస్తే రాణిస్తామని భావిస్తారే గానీ మహామహులు ఉన్నప్పుడు వచ్చి ఫెయిల్ కావాలని ఎవ్వరూ భావించరు. ఉదాహరణకు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు వంటి దిగ్గజాలు ఉన్నప్పుడు చిరు వచ్చి దెబ్బతిన్నాడు. కాబట్టి రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చే సమయం ఎప్పుడు అనేది కూడా ఖచ్చితంగా విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది అనేది నగ్న సత్యం. ఇక తమిళనాట రాజకీయాలకు, సినిమాలకి ఎంత దగ్గరి సంబంధమో అందరికీ తెలిసిందే. అలాగని రాజకీయాలలోకి వచ్చిన ఎమ్జీఆర్ స్థాయి నటుడు శివాజీగణేషన్, కార్తీక్, ప్రభు నుంచి వడివేలు వరకు ఎందరో దెబ్బతిన్నారు. వీరిలో భాగ్యరాజా కూడా ఒకడు. ఈయన గతంలో సినిమాలలో ఫేడవుట్ అయిన తర్వాత ఎంజీఆర్ పేరుతో పార్టీ పెట్టి ఘోర ఓటమి చవిచూశాడు.
ఇక ఆయన తాజాగా తాను కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నానని స్పష్టం చేశాడు. ఎంజీఆర్ తన సినిమాలలో సమాజం, రాజకీయాలు ఎలా ఉండాలో చూపించాడని, తన తోటి కళాకారులకు, ప్రజలకు ఎంతో చేశాడని, మరి రజనీ, కమల్‌ని ప్రజలకు ఏమి చేశారని ప్రశ్నించాడు. ఇక దర్శకనిర్మాతగా, రచయితగా, నటునిగా కె.భాగ్యరాజా 'బహుముఖప్రజ్ఞాశాలి'. కానీ ఆయన వ్యాఖ్యలు వింటుంటే ఏదో అసూయతోనే అలా స్పందిస్తున్నాడని అర్ధమవుతోంది. ఎంజీఆర్‌లా ఎందరో నటీమణులను నాశనం చేసిన వాడిగా భాగ్యరాజాకి కూడా అంతే చెడ్డపేరు ఉంది. మరోవైపు రజనీ, కమల్‌లు సమాజానికి ఏమి చేశారని ప్రశ్నించేముందు తాను సమాజానికి ఏమి చేశానని భాగ్యరాజా ప్రశ్నించుకుంటే మంచిది. మరోవైపు శరత్‌కుమార్ విశాల్‌పై కూడా పనిలో పనిగా ఆరోపణలు చేశాడు.
యువత రాజకీయాలోకి రావాలని పిలుపునిచ్చిన విశాల్, ముసలి వాడైన రజనీకి ఎలా మద్దతు ఇస్తాడని ప్రశ్నించాడు. మరోవైపు శరత్‌కుమార్, భాగ్యరాజా..ఈ ఇద్దరు ఎమ్జీఆర్ ఆశయాలను నిలబెట్టాలంటే అన్నాడీఎంకేలోని పళని స్వామి, పన్నీరుసెల్వం, దినకరన్ వర్గాలు కలిసి పోవాలని సెలవిస్తున్నారు. మరోవైపు రజనీ ఈ మధ్య ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ, నిన్న శివాజీగణేషన్, నేడు నేను...రేపు మరొకరు అన్నాడే గానీ ఎంజీఆర్ ప్రస్తావన తేలేదు. అలాగే కరుణానిధిని కలిశాడే గానీ అన్నాడీఎంకే వర్గాలను కలవలేదు. సో.. రజనీ పార్టీ అన్నాడీఎంకేకి పోటీగా ఉండనుందని అర్ధమవుతోంది. మరి కమల్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది...!