సౌతిండియన్ సూపర్‌స్టార్ రాజకీయాలలోకి వస్తున్నారని గత రెండు దశాబ్దాలుగా వార్తలు వస్తున్నట్లే ఆయన తుది చిత్రం ఇదేనంటూ వార్తలు కూడా బోలెడు వచ్చాయి. 'భాషా, బాబా, లింగ' వంటి సినిమాల విడుదలకు ముందు ఇలాంటి వార్తలు రావడం, అవి డిజాస్టర్స్ కావడంతో మరలా ప్రేక్షకులు కోసం మరో సినిమా అని, విజయవంతంగా కెరీర్‌ని ముగించాలని రజనీ తర్వాత కూడా సినిమాలు చేస్తూనే వచ్చాడు. ఇక తాజాగా ఆయన తాను రాజకీయాలలోకి ప్రవేశించి, కొత్త పార్టీ పెడతానని చెబుతున్న నేపధ్యంలో రజనీ సినిమా కెరీర్‌పై మరోసారి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన శంకర్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్‌లతో 400 కోట్లకుపైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న '2.0' చిత్రం షూటింగ్‌ని, డబ్బింగ్‌ని కూడా పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 14న తమిళ కొత్త సంవత్సరం కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మరోవైపు ఆయన 'కబాలి' ఫేమ్ రంజిత్ పా దర్శకత్వంలో తన అల్లుడు ధనుష్ నిర్మాతగా 'కాలా' చిత్రం చేస్తున్నాడు. ఇది కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక రజనీ పార్టీపై దృష్టి పెట్టేముందు తనకు పొలిటికల్ మైలేజ్‌కి ఉపయోగపడేలా తన చివరి చిత్రం తీసి సినిమా కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడట. ఆ చిత్రాన్ని కూడా రంజిత్ పా దర్శకత్వంలోనే ఈ పొలిటికల్ మైలేజ్‌ని ఇచ్చే చిత్రం చేయనున్నాడని, ఈ చిత్రం ఈ ఏడాది మధ్యలో ప్రారంభం జరుపుకుని ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. మరోవైపు కమల్ కూడా శంకర్ దర్శకత్వంలో తన పొలిటికల్ మైలేజ్ కోసం 'భారతీయుడు' సీక్వెల్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి. దిల్‌రాజు బయటికి వచ్చినా తాను కూడా చివరి చిత్రంగా ఓ రాజకీయ నేపధ్యం ఉన్న మూవీ చేయాలని కమల్‌కి కోరిక. వీరిద్దరు సొంత పార్టీలు పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోనే పోటీ చేస్తామని చెబుతున్నారు.
మరోవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళ్తుందని అలా జరగని పక్షంలో కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న తమిళనాడు ప్రభుత్వానికి కూడా ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. పన్నీర్‌సెల్వం, పళని స్వామి, దినకరన్, కమల్, రజనీ వంటి వారికి సమయం ఎక్కువ ఇస్తే బలం పుంజుకుంటారని, దాంతో వారు బలం పుంజుకోకముందే డిఎంకేతో కలిసి బిజెపి ఎన్నికలకు పోవాలని భావిస్తోంది. దాంతో వచ్చే ఏడాదే తమిళ అసెంబ్లీ ఎన్నికలు వస్తే మాత్రం కమల్, రజనీ ఇద్దరు పొలిటికల్ చిత్రాలలో నటించే సమయం ఉండే అవకాశాలు కనిపించడం లేదు.