మన హీరోలకి అభిమానులు అవసరమైనప్పుడు మాత్రమే కావాలి. పవన్ ఫ్యాన్స్ అభిమానాన్ని అర్ధం చేసుకోకుండా పోయిన బన్నీ ఇటీవల తన సోదరుడు అల్లుశిరీష్ ఫంక్షన్‌లో కూడా తన అభిమానులను ఏవేవో అనేశాడు. ఇక బాలయ్య వంటి వారయితే తమ పవర్ చూపిస్తారు. సెలబ్రిటీలన్న తర్వాత తమ అభిమానుల నుంచి, అది కూడా కేవలం కొందరి నుంచి వచ్చే అత్యుత్సాహాన్ని కూడా లైట్‌గా తీసుకోవాలి. అప్పుడే అభిమానులు, ప్రేక్షకులు నిజమైన ప్రేక్షకదేవుళ్ల కోవలోకి వస్తారు. అంతేగానీ అభిమానాన్ని క్యాష్ చేసుకునే హీరోలను అభిమానులే దూరంగా ఉంచడం మేలు. ఇక తమిళ హీరోల పరిస్థితి మాత్రం దీనికి చాలా భిన్నమని ఇండస్ట్రీ బాగా తెలిసిన వారికి బాగా తెలుసు.
రజనీకాంత్, సూర్య, విక్రమ్, కార్తి వంటి వారు అభిమానులకు ఎంతో గౌరవం ఇస్తారు. ఇటీవల విక్రమ్ విదేశాలలో ఓ ఫంక్షన్‌కి హాజరైనప్పుడు ఓ అభిమాని కాళ్లపై పడినప్పుడు చూపిన ఆప్యాయత, తన అభిమాని మరణం చూసి భోరున విలపించిన కార్తి, అభిమానులను దయచేసి నా కాళ్లకు మొక్కవద్దు. డబ్బు, పరపతి, హీరోలు ఎవ్వరికీ పాదాభివందనాలు వద్దు.. మీరు నిజమైన పాదాభివందనం మిమ్మల్ని కనిపెంచిన తల్లిదండ్రులకు చేయండి అని చెప్పే రజనీ.. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక సూర్య కూడా అంతే.
ఆయన తండ్రి నటుడైనా కూడా ఈయన చెన్నైలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో నెలకి 720రూపాయల జీతానికి పనిచేశాడు. కానీ స్టార్‌ని అయినపోయిన తర్వాత సామాన్యులకు దూరమయ్యానని, 'గ్యాంగ్' చిత్రం సమయంలో మరలా రోడ్లపై టీ తాగుతూ, సామాన్యులను పరిశీలించేలా చేసిన ఘనత సూర్యది. తాజాగా ఆయన నటించిన 'గ్యాంగ్' చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు హాజరైన తన అభిమానులను స్టేజీ పైకి పిలిచి వారితో కలిసి డ్యాన్స్ చేశాడు. మరోవైపు తనకి పాదాభివందనాలు చేయవద్దని, అది తనకు అసౌకర్యంగా ఉంటుందని చెప్పినా కొందరు స్టేజీపైకి వచ్చి తన కాళ్లకు నమస్కారం చేయడంతో ఆయన తిరిగి అదే అభిమానులకు పాదాభివందనం చేసి రుణం తీర్చుకోవడం చూస్తే ఎవరికైనా ఆయన గొప్పతనం అర్ధమవుతుంది...!