ఒకవైపు పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్, కత్తి మహేష్‌ల మద్య సాగుతున్న వివాదం పెద్దది అవుతోంది. తమ్మారెడ్డి భరద్వాజ, కోనవెంకట్‌ల మాటలను కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇది ఇప్పుడు తెలుగు వారందరిలో ఎంతో ఆందోళన కలిగిస్తోంది. ఒకరిపై ఒకరి మాటల యుద్దం ఆగడం లేదు. దాంతో చెన్నైలోఉండే తెలుగు యువశక్తి అధ్యక్షుడు, దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తాజాగా తన ఫేస్‌బుక్‌లో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ చిరంజీవి జోక్యం చేసుకుని ఈ వివాదానికి తెర దించాలని చెప్పాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవికి రాజశేఖర్‌కి కూడా గొడవ వచ్చినప్పుడు చిరంజీవి.. రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆ వివాదాన్ని పరిష్కరించాడు. కాబట్టి చిరునే ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించాలి. ఇక పవన్ అభిమానులు కాస్త సంయమనం వహించాలి. పవన్ నిజాయితీపరుడు. నిజాయితీ పరులకు ఆవేశం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం ఉంటుంది. ఆయన ఎవ్వరికీ తలవంచే రకం కాదు. ఆయన మొండివాడు. ఇక ఆయన ప్రస్తుతం ఓ పార్టీని స్థాపించి కిందటి ఎన్నికల్లో టిడిపి గెలుపులో కీలక పాత్రను పోషించాడు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? టిడిపికి, బిజెపికి మద్దతు ఇస్తారా? వైసీపీకి మద్దతు ఇస్తారా? లేక సొంతగా తానే అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తారా? అనేది ఆయన ఇష్టం. ఇక రాజకీయాలు అవసరాన్ని బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి.
'ప్రజారాజ్యం' సమయంలో కాంగ్రెస్‌ని టార్గెట్ చేసిన పీఆర్పీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. పవన్ నాడు కాంగ్రెస్ వారి పంచలూడదీయమని చెప్పాడు. అవకాశం లేనప్పుడు అవసరాన్ని వాడుకోవడమే రాజకీయం. ఇందులో శాశ్వత మిత్రులు గానీ శాశ్వత శత్రువులు గానీ ఉండరు. ఈ విషయం పవన్ అభిమానులు గుర్తుంచుకోవాలి. ఈ వివాదం వల్ల చిరంజీవి పవన్‌కళ్యాణ్‌లకే చెడ్డ పేరు వస్తుంది వారి ప్రత్యర్దులు దీనిని అవకాశంగా మార్చుకుని వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు.
చిరంజీవి ఫ్యామిలీ అభిమానులకు ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ వివాదం వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళ్తూ, ఆ ఫ్యామిలీ పరువు పోయేలా ఉంది. కాబట్టి చిరంజీవి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరాడు. అయినా ఎవ్వరి మాట వినని వారు కేతిరెడ్డి మాటలను పట్టించుకుంటారా? అనేది వేచిచూడాల్సివుంది. మరోవైపు పలువురు ఆల్‌రెడీ ఇప్పటికే వివాదాస్పద వ్యక్తిగా మారిన కేతిరెడ్డి.. ముందు తన లక్ష్మీపార్వతి గొడవను పరిష్కరించుకుని తర్వాత పక్కవారికి నీతులు చెప్పమను.. అని అంటున్నారు.