కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య రేగిన వివాదం పలు మలుపులు తిరుగోంది. ఆయన సంక్రాంతి నాడు చిత్తూరు జిల్లాలోని పీలేరు సమీపంలోని తన స్వస్థలానికి కారులో వెళ్తుంటే ఆయన్ను గుర్తుపట్టిన కొందరు పవన్ అభిమానులు ఆయన కారుని వెంబడించి, జై పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేశారని, తాను తప్పించుకుని తన ఊరు చెరుకున్నానని, అప్పటికే కొందరు పవన్ అభిమానులు తిరుపతి, మదనపల్లితో పాటు పలు ప్రాంతాల నుంచి తన గ్రామానికి వచ్చి తన గురించి ఎంక్వైరీ చేసి వెళ్లారని కత్తి మహేష్ తీవ్ర ఆరోపణలు చేశాడు. మరోవైపు కత్తి మహేష్ వివాదం విషయంలో 15వ తేదీ వరకు కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ మౌనంగా ఉండాలని కోరిన కోనవెంకట్ ఇచ్చిన గడువు ముగిసిపోయి రెండు రోజులు కావస్తున్నా కోన వెంకట్ నుంచి పవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇక కత్తిమహేష్‌ని పవన్ ఫ్యాన్స్ ఏడు ప్రశ్నలు వేసి టార్గెట్ చేశారు. వీటికి తాజాగా కత్తి మహేష్ సమాధానాలు ఇచ్చాడు. మీ తండ్రి వ్యవసాయ అధికారిగా ఎన్నికోట్లు మింగాడు? అనే ప్రశ్నకు తన తండ్రి రిటైర్‌మెంట్ ఇచ్చిన తర్వాత వచ్చిన డబ్బుతో తమ గ్రామంలో తమకు ఉన్న స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. నేను కాస్త హుందాగా, ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ, పాష్‌గా ఉండేసరికి నా తండ్రి కోట్లు సంపాదించాడని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.. అని కత్తి సమాధానం ఇచ్చాడు. తన తల్లి చీటీల పేరుతో ఎవ్వరినీ మోసం చేయలేదని, ఆమె క్యాన్సర్ కారణంగా రెండేళ్ల కిందటే మరణించిందని చెప్పాడు. ఇక అంబటి రాంబాబు వల్లనే నాకు బిగ్‌బాస్ షోలో అవకాశం వచ్చిందనడం తప్పు. బిగ్‌బాస్ కోసం ఓ బృందం ముంబై నుంచి వచ్చి ఎంపిక చేసింది. మొత్తం 80 మందిని ఇంటర్వ్యూ చేసి నన్ను ఎంపిక చేశారు. ఇందులో అంబటిరాంబాబుతో సహా ఎవ్వరికీ ప్రమేయం లేదు. నా కుటుంబం ఏమీ మా ఊరి నుంచి వెళ్లిపోలేదు. అక్కడే ఇల్లు కట్టుకుని నా తండ్రి ఉన్నారు.
నేను వైసీపీ నుంచి డబ్బు తీసుకుని మాట్లాడుతున్నాననేది అబద్దం. నేను నా ఆత్మగౌరవం, నా కోసం నేను పోరాడుతుంటే వైసీపీ డబ్బుల వల్లే నేనుఇలా మాట్లాడుతున్నానని అనడం అన్యాయం. పవన్ అభిమానులు సామాజిక విధ్వంసకారులుగా మారారు. నేను నా సోదరి భర్త నుంచి బెదిరించి డబ్బులు తీసుకున్నాననడం కూడా నిజం కాదు. ఆయన పాటికి ఆయన ఉద్యోగం చేసుకుంటూ, తన ఫ్యామిలీని గడుపుతున్నాడు. ఆయన ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంది. ఇక నేను పండగ నాడు నా స్వంత గ్రామానికి వెళ్లానే గానీ తప్పించుకుని తిరగటం లేదని చెప్పుకొచ్చాడు. ఇలా పవన్ అభిమానులు వేసిన ప్రతి ప్రశ్నకు కత్తి మహేష్ సమాధానం ఇచ్చాడు.