తామెదో గొప్ప ఘనకార్యం చేసినట్లు, ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి మరీ కత్తి మహేష్ పూర్తి వివరాలను సేకరించినట్లుగా పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ ఎదుట ఏడు ప్రశ్నలను ఉంచారు. వాటికి కత్తి మహేష్ సమాధానం ఇచ్చాడు. ఇక ఈ వివాదంలో మొదట పవన్ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కత్తి మహేష్ తన అభిమానులను అదుపు చేస్తూ ఒక ట్వీట్‌పెట్టినా చాలని ఓ మెట్టు దిగాడు. కానీ పవన్ అభిమానులు మాత్రం ఆయనను, ఆయన కుటుంబసభ్యులని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ అభిమానులు కేవలం కత్తి మహేష్ విషయంలోనే గాదు.. ఆయనను విమర్శించే ప్రతి ఒక్కరిని అసభ్యపదజాలంతో, భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరికలు చేస్తుండటం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఈరోజు కేవలం కత్తి మహేష్ వ్యక్తి గత విషయమే కదా.. అని మౌనంగా ఉంటే పవన్ వీరాభిమానులు కొందరు భవిష్యత్తులో కూడా ఆయనపై విమర్శలు చేసేవారి పట్ల ఇలాగే ప్రవర్తిస్తారనేది మౌనంగా ఉంటున్న మేధావులు తెలుసుకోవాల్సిన విషయం.
ఇక కత్తిమహేష్ మాట్లాడుతూ, తాను పవన్‌ని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించలేదని, పవన్ ఫ్యాన్స్ తన మీద వ్యక్తిగతంగా విరుచుకు పడితేనే తాను అలా స్పందించాల్సి వచ్చిందని వివరణ కూడా ఇచ్చాడు. ఈ ప్రజాస్వామ్యదేశంలో నా మనోభావాలను నేను నిర్భయంగా వెల్లడించే హక్కులేదా? అనే కత్తి మహేష్ మాటలకి అందరూ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఓ టీవీఛానెల్‌లో జనసేన నాయకుడు రాజారెడ్డి మాట్లాడుతూ, ఎవరివయ్యా నువ్వు? మర్యాదగా క్షమాపణ చెప్పి, పవన్ ఫొటోలోని ఆయన కాళ్లకు దండం పెడితేనే నిన్ను వదులుతాం అని మీడియా సమక్షంలోనే మాట్లాడటం అదుపు తప్పుతున్న అభిమానానికి సంకేతంగా చెప్పాలి. దీంతో కత్తి మహేష్ తాను ఒక మెట్టు దిగినా పవన్ ఫ్యాన్స్ దూకుడు ఆగడం లేదని, ఇదే జరిగితే ప్రజాస్వామ్య సంఘాలతో, మేధావులతో, బిసి, దళిత ఉద్యమ నేతల సాయంతో ఉద్యమం చేస్తానని, అప్పుడు పవనే తన దగ్గరకు రావాల్సివుంటుందని ఘాటుగానే హెచ్చరించాడు.
జాగ్రత్తగా ఉండండి. నా కదలికల మీద నా కుటుంబ సభ్యుల మీద నిఘా పెడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. పవన్ నా ముందుకు వస్తే ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టే సాక్ష్యాలను నేను ఆయనకు చూపించగలను అంటూ హెచ్చరిక చేయడం, మరో వైపు ఉస్మానియా విద్యార్ధులు కూడా కత్తి మహేష్‌కి అండగా ఉన్నామని ప్రకటించడంతో పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీయక తప్పేలా లేదు అని మాత్రం చెప్పవచ్చు.