ఇప్పుడు పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్, కత్తి మహేష్‌ల వివాదంలోకి వచ్చిన నిర్మాత రాంకీ కత్తి మహేష్‌ని ఉద్దేశించి అతనికి మాట్లాడటం తప్పితే దర్శకత్వం గురించి, సినిమాల గురించి ఏమీ తెలియదని వాదిస్తున్నాడు. ఇంతకీ రాంకీ ఎన్ని చిత్రాలు నిర్మించాడు? ఎన్ని విజయాలు సాధించాడు? ఆయనకి సినిమాలపై ఉన్న అవగాహన ఎంత అనేది ప్రజలకు కూడా ఆయనే చెప్పాలి. తాజ్‌మహల్‌ని ఇంకా బాగా కట్టి ఉంటే బాగుండేది అని ఎవరైనా విమర్శ చేస్తే ఏదీ నువ్వు కట్టి చూడు అనేది వితండవాదనే అవుతుంది. అలాగైతే క్రికెట్ కామెంట్రీ చేసేవారు చెత్త బాల్‌కి సచిన్ అవుటయ్యాడని చెబితే ఏదీ నువ్వు కొట్టి చూపు అన్నట్లుగా రాంకీ వైఖరి ఉంది. ఇక తాజాగా ఆయన కత్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరింత అసహజంగా ఉన్నాయి. కత్తి సినిమా ఫీల్డ్‌లోనే ఉంటూ సినిమా వాళ్లని తిడుతున్నాడని వ్యాఖ్యానించాడు.
తిట్టడానికి, విమర్శకు తేడా తెలియని రాంకీ వంటి వారు పెద్ద మనుషులు చలామణి కావడం దురదృష్టకరం. ఇక కత్తి మహేష్ మొదట్లో కేవలం పవన్‌ని, బాలయ్యని విమర్శించాడే గానీ తిట్టలేదు. స్టార్ హీరోగా, ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బాలకృష్ణ అభిమానులను కొట్టడం, అసభ్యపదజాలం వాడటం తప్పు అని చెప్పడం కూడా తిట్టడం కింద రాంకీ పోలుస్తుంటే అతని అజ్ఞానాన్ని చూసి నవ్వురాకమానదు. అంటే సినిమా ఫీల్డ్‌లో ఉన్నంత మాత్రాన సినిమా వారిని దేవుళ్లుగా భావించాలా? వారేమైన విమర్శలకు అతీతులా? అనే సందేహం వస్తోంది. మరోవైపు ఇండస్ట్రీలోని పెద్దలే జర్నలిస్ట్‌ల వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుంటూ పలు రకాలుగా ప్రలోభపెడుతున్నారు. మరి అలాంటిది సినిమా ఫీల్డ్‌లో ఉన్నంత మాత్రాన ఏది తీసినా, ఏమి చేసినా మెచ్చుకోవాలా? మనం ఇండియన్స్ అయినంత మాత్రాన దేశంలోని సమస్యలను, పార్టీల వైఖరులను విమర్శించకూడదనే వాదన ఎంత వరకు సమంజసం? ఇక కత్తిమహేష్‌పై కొండాపూర్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య. దీనిపై ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ తీవ్రంగా స్పందించడం చూస్తే ఈ గొడవ ముదిరిపాకన పడుతోందని అర్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మలను తగుల బెట్టాలని ఇతర యూనివర్శిటీల విద్యార్ధులను కూడా ఉస్మానియా జేఏసీ పిలుపునిచ్చింది. పవన్ తన అభిమానులను మౌనంగా ఉంచలేని, నియంత్రించలేని చేతకాని వాడు అని జేఏసీ వ్యాఖ్యానించింది.
ఇక తాజాగా 'అజ్ఞాతవాసి' చూసిన ఓ అభిమాని తన 100 రూపాయలు వేస్ట్ అయ్యాయని చెప్పి, పవన్ పోస్టర్‌ని చెప్పులతో కొట్టడం, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో పవన్ అభిమానులు ఆ అభిమాని ఆచూకి కనుగొని ఆ అభిమానిని ఇష్టం వచ్చినట్లు కొడుతూ, పవన్ ఫొటోకి దండవేసి, దణ్ణం పెట్టే వరకు బట్టలూడదీసి కొట్టి, ఎవరైనా పవన్‌ని విమర్శిస్తే ఇలాగే చేస్తామని బెదిరించడం అనాగరిక చర్య. ఇక ఈ విషయంలో దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాత్రం హుందాగా ప్రవర్తించాడు. పవన్ అభిమానులపై కత్తిని పోలీసులకు ఫిర్యాదు చేయమని, అలా చేస్తే తాను కూడా కత్తి మహేష్‌కి మద్దతు ఇస్తానని తెలిపాడు. ఇంతకాలం అసలు కత్తి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనేది అసలు ప్రశ్న.
దీనిపై కత్తి మహేష్ స్పందిస్తూ, తాను ఛానెల్స్ డిబేట్‌లో పాల్గొన్నప్పుడు పవన్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్ ఫోన్ నెంబర్లు, అసభ్యంగా వచ్చిన వీడియోలు , జనసేన పార్టీకి చెందిన 'శతఘ్ని' ఛానెల్‌లో పవన్ మాట్లాడిన తీరుని కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పిన కత్తి మహేష్ ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనున్నాడు. మొత్తంగా ఈ వీరాభిమానుల వ్యవహారం శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యానికి పట్టిన చీడగా అర్ధమవుతోంది. గతంలో ఫ్యాన్స్ మధ్య గొడవలు వచ్చినప్పుడు రజనీకాంత్, కమల్‌హాసన్, అజిత్, విజయ్, ధనుష్, శింబు వంటి వారు అభిమానులకు ఎంతో సందేశం అందించారు. ఆ మాత్రం కూడా చేయని పవన్ చేతగానితనం ఇంకా కొనసాగితే అది ఆయనకే ముప్పు అని చెప్పాలి.