దక్షిణాది నుంచి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత జయలలిత స్థాయిలో కాకపోయినా ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికై, సమాజ్‌వాదీ పార్టీలో ఉండి, కేంద్రంలో చక్రం తిప్పి, ఉన్నతస్థాయికి ఎదిగిన మరో దక్షిణాది మహిళ జయప్రదనే అని చెప్పాలి. ఈమె అడుగులు తెలుగుదేశం నుంచే మొదలైనప్పటికీ ఆ తర్వాత దేశ రాజకీయాలను శాసించింది. ప్రస్తుతం రాజకీయంగా పెద్దగా యాక్టివ్‌గా లేని ఆమె మరోసారి ఏపీలోని ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి మరలా రంగప్రవేశానికి సిద్దమవుతోందని సమాచారం.
ఇక తాజాగా ఆమె మాట్లాడుతూ, రాజకీయాలంటే రెండున్నర గంటల్లో ముగిసిపోయే సినిమా కాదు. రాజకీయాలలో రాణించడం చాలా కష్టమైన పని... అని వ్యాఖ్యానించింది. ఇక ఇటీవలే రజనీకాంత్, కమల్‌హాసన్‌లు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో ఆమె వారి గురించి మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ, వీరిద్దరు నడవాలనుకుంటున్న మార్గం పూల బాట, పూల పాన్పు కాదు. ఎన్నో ముళ్లు, రాళ్లతో కూడిన కఠినతరమైన మార్గం. అలాంటి కష్టతరమైన మార్గాన్ని వారు ఎంచుకున్నారు. జాగ్రత్తగా చూసి అడుగులు వేయాలి. సినిమాలకు, రాజకీయాలకు ఏ సంబంధం ఉండదు. వారిద్దరి రాజకీయరంగ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను. జయలలిత తర్వాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను వీరు భర్తీ చేస్తారని అనుకుంటున్నాను. వీరిద్దరిలో ఎవరు రాణిస్తారనేది ఇప్పుడే చెప్పలేం. నేను రాజకీయాలలోకి వచ్చే విషయాన్ని త్వరలో చెబుతాను అని ప్రకటించారు.
ఇక ఈమె గతంలో రజనీకాంత్, కమల్‌హాసన్ ఇద్దరితో కలిసి పలు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కమల్‌హాసన్ జోరు పెంచాడు. తన పార్టీ పేరును, తన పర్యటన వివరాలను ఆయన ప్రకటించాడు. ఇక విలేఖరులు మరో ఆరునెలల్లో వెంటనే ఎన్నికలు వస్తే ఏమి చేస్తారని రజనీని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటానని నమ్మకంతో చెప్పాడు. తాను, కమల్ కలిసి రాజకీయాలలో నడిచేది, లేనిది కాలమే నిర్ణయిస్తుందని సమాధానం ఇచ్చాడు. మరోవైపు ఓ సర్వేసంస్థ చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో తమిళనాడులో రజనీకాంత్‌కే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని తేలింది. మరి ఇవి నిజమవుతాయో లేదో వేచిచూడాల్సివుంది..!