తెలుగులో తన తండ్రి ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలు, భక్తిరస పాత్రలు, జానపదాల వంటి వాటిని కూడా చేయడం బాలయ్యకే చెల్లింది. జూనియర్ ఎన్టీఆర్‌కి ఆ సత్తా ఉన్నా కూడా 'యమదొంగ'లో జూనియర్ యముడు పాత్ర తప్పించి అలాంటి ప్రయోగాలు ఇంకా చేయలేదు. ఇక బాలయ్య చేసే రొటీన్, మాస్ చిత్రాలను చూసిన తర్వాత ఆయనలోని నటుడు పూర్తిగా వెలుగు చూడలేకపోతున్నాడని కొందరు ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పులేదు. రొటీన్ మాస్, పవర్‌ఫుల్ డైలాగ్స్ నుంచి ఆయన తనదైన శైలిలో 'శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఆదిత్య 369'లోని కృష్ణదేవరాయలు, 'భైరవద్వీపం'లోని కురూపి, 'శ్రీకృష్ణార్జున విజయం', 'పాండురంగడు'లో పోషించిన అవిటి వాని పాత్ర వంటివి ఆయన నుంచి ఎక్కువగా ఆశిస్తారు.
ఇక ఈయన ప్రారంభించిన 'నర్తనశాల' కూడా తెరకెక్కితే చూడాలనేది అందరి ఆశ. ఇక తాజాగా బాలయ్య మరో సంచలన ప్రకటన చేశారు. 'జైసింహా' విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, ప్రతి మతంలోని సారాంశాన్ని తెలుసుకుంటూ ఉంటాను. చాపకూటి సిద్దాంతాన్ని చెప్పి, అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ బోధించిన 'రామానుజాచార్యులు' జీవిత చరిత్ర చేయాలనేది నా కోరిక. నాకు 60ఏళ్ల వయసు రాగానే అంటే మరో మూడేళ్లలో ఆ సినిమాని చేస్తాను... అని తీపి కబురును చెప్పాడు. బహుశా బాలయ్య దర్శకత్వ తెరంగేట్రం కూడా 'నర్తనశాల' బదులు 'రామానుజాచార్యులు'తో నెరవేరుతుందని పలువురు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్‌కి కుమారుడిగా పుట్టడం నా అదృష్టం. ఆయన జీవిత చరిత్రను త్వరలో చేయనున్నాను. నేను వైవిధ్యమైన, విలక్షణ చిత్రాలను చేసినప్పుడల్లా ప్రేక్షకులు నన్ను ఆదరించారని బాలయ్య తెలిపాడు.
మొత్తానికి బాలయ్య నుంచి 'ఎన్టీఆర్ బయోపిక్'తో పాటు 'రామానుజాచార్యులు' చరిత్రను కూడా చూసే భాగ్యం త్వరలోనే నెరవేరుతుందని ఆశించవచ్చు. మరోవైపు ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఇదే ఏడాది జరుగనుందని ఆయన గతంలోనే ప్రకటించాడు. ఇక 'జైసింహా' చిత్రంలో బ్రాహ్మణుల గొప్పదనాన్ని తెలిపే సన్నివేశాలలో అద్భుతంగా నటించిన ఆయనకు బ్రాహ్మణ సోదరులు కూడా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా బాలయ్య నుంచి వరుసగా అభిమానులకు తీపి కబుర్లు అందుతూనే ఉన్నాయి.