నేడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాలతో పాటు సిడిలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్, ఇంటర్నెట్, యూట్యూబ్‌లు, వెబ్‌సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ వంటి వాటి హవా నడుస్తోంది. ఇక సినిమా మేకింగ్‌లోనే కాదు ఆడియన్స్ టేస్ట్‌లో కూడా విపరీతమైన వైవిద్యపంధా కనిపిస్తోంది. ఈ విషయంలో ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త సాంకేతికతను, వాటిని తమ సినిమాల మేకింగ్‌కి వినియోగించడం, ఇప్పటికీ ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించే దమ్ము ఉన్నవారే ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఈ స్పీడ్‌ని అందుకోలేని వారు తెరమరుగైపోతున్నారు. ముఖ్యంగా నాలుగైదు సినిమాలు హిట్టయితే చాలు రచయితలలో కూడా తాము ఏది రాస్తే అదే జనాలు చూస్తారు. మేము తీసిందే సీన్, మేము రాసిందే పంచ్ అన్నట్లుగా నిర్లక్ష్య వైఖరి ఎక్కువవుతోంది. దీనికి హరీష్‌శంకర్ నుంచి త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
కానీ వందల చిత్రాలకు పనిచేసినా ఎక్కడా తమ వృత్తిపరంగా నిర్లక్ష్యం చూపని వారిలో పరుచూరి బ్రదర్స్ ముందుంటారు. మూడు తరాల నటీనటులను, స్టార్స్, స్టార్ డైరెక్టర్స్‌ని, ఆడియన్స్‌ని మెప్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. వారు పనిచేసిన సినిమాలు ఆడకపోయి ఉండవచ్చు గానీ వారు రచయితలుగా, ప్రేక్షకులు పల్స్ పట్టుకోవడంలో ఎప్పుడు ఫెయిల్‌కాలేదు. నిర్లక్ష్యం వహించలేదు. నిత్య విద్యార్దులుగా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండటం, ఏ తరం వారికి ఆ తరహా రచనలు చేయడంతోనే వారు వందల చిత్రాలకు పనిచేయగలిగారు. ఇక ఒకప్పటిలా మూడు గంటలకు పైగా చిత్రాలను ప్రేక్షకులు ఆదిరించడం లేదు. కట్టె కొట్టే తెచ్చె రీతిలో హాలీవుడ్ తరహాలో కేవలం రెండు గంటల చిత్రాలను మాత్రమే ఆదరిస్తున్నారు. అనవసర డైలాగ్స్, సీన్స్, పాటలను రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో ప్రతి సీన్ ప్రేక్షకుడిని రంజింపజేసేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
రాజమౌళి తన ఇంటర్వెల్ బ్యాంగ్‌లని, హీరోయిజంని పీక్స్‌కి తీసుకెళ్లడం ఎలాగో ఇప్పటికే నిరూపిస్తున్నాడు. ఇక సినిమా మొదటి హాఫ్ పెద్దగా ఆకట్టుకోకపోయిన ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఆసక్తి రేకెత్తించి, సెండాఫ్, మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌ని ప్రేక్షకుల చేత ఒప్పించగలిగితేనే సక్సెస్‌లు వస్తున్నాయి. దీని గురించి తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'కలియుగమహాభారతం, ఛాయ' వంటి చిత్రాలను తీసిన హనుమాన్ ప్రసాద్ తమకు ఇచ్చిన గొప్ప విలువైన సలహా ఏమిటో తెలిపాడు. సినిమా అంతా ముష్టాన్న భోజనం అందించినా కూడా క్లైమాక్స్ అనేది భోజనం తర్వాత వేసుకునే కిళ్లీ లాంటిది.
ఎంత భోజనం అద్భుతంగా ఉన్నా చివరలో వేసుకునే కిళ్లీలో సున్నం ఎక్కువైతే ఊసేసి తిట్టుకుంటాం. అలాగే సినిమా అంతా అద్భుతంగా ఉన్నా క్లైమాక్స్ అనే కిళ్లీ మంచి పసందును ఇచ్చినట్లే సినిమాకి క్లైమాక్స్ ఉండాలని ఆయన పరుచూరికి చెప్పారట. ఆ మాటలు ఎంతో తమకి ఉపయోగపడ్డాయని, ఆయన ఇచ్చిన సలహా అమూల్యమైనదని పరుచూరి మెచ్చుకున్నారు. నిజంగా పరుచూరి బ్రదర్స్‌కి ఉన్న పేరు సినిమా పరిశ్రమలో హనుమాన్ ప్రసాద్‌కి ఉండకపోవచ్చు గానీ ఎన్నో వందల చిత్రాలకు పనిచేసిన తమకి ఆయన ఇచ్చిన విలువైన సలహా ఇది అని గోపాలకృష్ణ ఓపెన్‌గా చెప్పడం నిజంగా వారి పెద్దతనానికి నిదర్శనంగా చెప్పాలి.