ఆడియో స్థానంలో ప్రీరిలీజ్ వేడుకలు, టీజర్లు, స్టంపర్లు, ఫస్ట్ ఇంపాక్ట్‌లు, నేరుగా లిరిక్ ఆడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడం... ఇలా తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక ఇప్పుడు ఏకంగా మహేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేసే డైలాగ్స్‌ని రిపబ్లిక్‌డే రోజున ఉదయం ఏడుగంటలకు ఆల్ ఆడియో ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేయనున్నామని 'భరత్ అనే నేను' చిత్రం విషయంలో యూనిట్ ప్రకటించింది. సో.. అభిమానులు ఈ ప్రమాణస్వీకారం వినడానికి ఇప్పటినుంచే హెడ్‌ఫోన్స్‌ని రెడీగా పెట్టుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం టైటిల్ 'భరత్ అనే నేను' అని ప్రచారంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఇదే టైటిల్ అని ఇప్పటివరకు చెప్పలేదు. మొత్తానికి రిపబ్లిక్‌డే రోజున ముఖ్యమంత్రిగా మహేష్ చేసే ప్రమాణ స్వీకారంలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. భరత్ అంటే దేశభక్తి కలిగిన పేరు కాబట్టి బహుశా ఇదే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో కైరా అద్వానీ మహేష్‌కి జోడీగా నటిస్తుండగా, చిత్రం రిలీజ్ డేట్ విషయంలో కూడా మహేష్, బన్నీలు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. మద్యలో శంకర్, రజనీ, అక్షయ్‌కుమార్‌లు '2.0' వస్తే గానీ వీరిలో ఎవరో ఒకరు సైడ్ అయ్యే చాన్స్‌లు కనిపించడం లేదు.
దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 'శ్రీమంతుడు' తర్వాత కొరటాలశివ-మహేష్ కాంబినేషన్‌లో వస్తున్నమూవీ కావడం, పైగా 'బ్రహ్మోత్సవం, స్పైడర్'ల డిజాస్టర్స్‌లతో మహేష్ కసితో ఉండటం, దేవిశ్రీప్రసాద్ సంగీతం వంటి వాటి ద్వారా ఈ చిత్రం ఎలాగైనా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అందరూ ఆశతో ఉన్నారు. మరోవైపు ఇలాగే త్రివిక్రమ్-పవన్‌ల హ్యాట్రిక్ మూవీ అనే క్రేజ్ వల్ల 'అజ్ఞాతవాసి'తో దెబ్బతిన్నవారు మాత్రం కాంబినేషన్ కంటే కంటెంట్ ఉంటేనే ఆడుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ యంగ్ సీఎంగా కనిపిస్తూ, ముఖ్యంగా కార్పొరేట్ విద్య, విద్యావ్యవస్థపై సాగే సెటైర్లతో సామాజిక స్పృహ కలిగించేలా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి మెసేజ్‌లతోనే ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించి కొరటాల హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన విషయం తెలిసిందే.
మరో వైపు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో క్లైమాక్స్‌కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు. మహేష్ ఫ్లాప్ హ్యాట్రిక్‌లు నమోదు చేయకుండా ఉండాలంటే ఈ చిత్రంతో ఆయన ఎలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టక తప్పని పరిస్థితి అనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని మహేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేయడం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.