స్టార్ హీరోల ఫ్యాన్స్‌ని ఆకట్టుకోవాలంటే అప్‌కమింగ్, మీడియం రేంజ్ హీరోలు, నటీనటులు, దర్శకులు ఎలాగోలా స్టార్ హీరోల పేరుని తమ చిత్రంలో ఉపయోగించుకోవడం ఎలా అనే దానిపై దృష్టిపెడుతున్నారు. ఏదో ఒక పాత్రను స్టార్ హీరోలకు అభిమానులుగా చూపి, వాటిని ప్రమోషన్స్ కోసం వాడుకుంటూ ఆయా స్టార్స్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియన్ స్టార్ అయిన షారుఖ్‌ఖాన్, దీపికా పడుకోనే వంటి వారే రజనీపై 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో లుంగీ పాటను చిత్రీకరించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు రజనీ ఇమేజ్ వాడుకోవడానికి మరో చిత్రం రంగం సిద్దం చేసుకుంటోంది.
శివాజీగణేషన్ మనవడు, సీనియర్ హీరో ప్రభు కుమారుడు, దర్శకనటుడైన విక్రమ్ ప్రభు హీరోగా ప్రస్తుతం తమిళంలో 'పక్కా' అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో తెలుగు ప్రేక్షకులకు 'కృష్ణాష్టమి, మలుపు' చిత్రాల ద్వారా పరిచయం ఉన్న నిక్కీగల్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె విక్రమ్ ప్రభు సరసన నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఇందులో విక్రమ్ ప్రభు డ్యూయెల్‌రోల్ పోషిస్తుండగా, నిక్కీ గల్రాని సరదా, చిలిపిదనం కలగలిసిన పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషిస్తోంది. ఇందులో ఆమె పాత్ర రజనీకి వీరాభిమాని పాత్ర అట.
తాను ఈ చిత్రం ఒప్పుకోవడానికి కారణం తాను బయటే కాదు.. ఈ చిత్రంలో కూడా రజనీకి వీరాభిమాని కావడమే కారణమని, కేవలం రజనీ సార్ మీద ఉన్న అభిమానంతోనే ఈ చిత్రం ఒప్పుకున్నానని ఈ భామ చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్. సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలోనే గాక నిక్కీ గల్రాని తమిళంలో 'కీ, కలగలప్పు2, చార్లిచాప్లెన్ 2' చిత్రాలలో నటిస్తోంది. మరి ఈ చిత్రమైనా ఆమెకి తమిళంలో మంచి గుర్తింపుతెచ్చి రజనీ కళ్లలో పడేలా చేస్తుందో లేదో వేచిచూడాల్సివుంది....!